మనదేశంలో ప్రైవేటు రంగంలో తొలి విమానాల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. టాటా ఎయిర్‌బస్ కన్సార్టియం దీనిని ఏర్పాటు చేస్తోంది. స్వయం సమృద్ధ భారత దేశం (ఆత్మ నిర్భర్ భారత్) దిశగా ఇది మరో ముందడుగు అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
భారత వాయుసేన (ఐఎఎఫ్)ను ఆధునికీకరించాలనే లక్షంతో ఈ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.21,995 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇక్కడ సీ 295 విమానాలను తయారు చేస్తారు.
ప్రధాని మోదీ శనివారం ఇచ్చిన ట్వీట్లో వైమానిక రంగానికి సంబంధించిన తదుపరి తరం మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఈ కంపెనీ ఉంటుందని తెలిపారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి.
ప్రపంచ ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్, భారతీయ దిగ్గజం టాటా గ్రూప్ సంయుక్తంగా ఈ కంపెనీని నెలకొల్పుతున్నాయి. ఇక్కడ తయారైన విమానాలను భారత వాయుసేనకు అందిస్తారు. ఈ విమానాలను పౌర అవసరాలకు కూడా వినియోగిస్తారని రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ తెలిపారు.
56 సీ-295 విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్ సంస్థతో భారత్ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకొన్నది. వాయుసేనలోని కాలం చెల్లిన ఎవిరో-748 విమానాల స్థానంలో సీ-295లను ప్రవేశపెడతారు.
రూ.21,000 కోట్లతో 56 విమానాలను కొనాలని నిర్ణయించింది. వీటిలో 16 విమానాలు స్పెయిన్ నుంచి వస్తాయి. మిగిలిన 40 విమానాలు వడోదరలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలో తయారవుతాయి. సీ 295 విమానాలను యూరోప్ బయట తయారు చేస్తుండటం ఇదే మొదటిసారి.
భారత్.. ఉత్పాదక రంగ హబ్‌గా ఆవిర్భవిస్తోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెబుతూ దేశంలో తొలిసారి మిలిటరీ రవాణా విమానాల తయారీకి శ్రీకారం చుట్టామని, స్వావలంబన దిశగా ఇది భారీ ముందడుగు అని పేర్కొన్నారు. భారత్ కొత్త మైండ్‌సెట్‌తో, నవీన పని సంస్కృతితో ముందడుగు వేస్తోందని తెలిపారు.
‘మేకిన్ ఇండియా.. మేక్ ఫర్ వరల్డ్’ అన్న మంత్రంతో తన సామర్థ్యాన్ని చాటుతోందని చెబుతూ భారత రక్షణ గగనతల రంగంలో రూ.21,935 కోట్ల భారీ పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తయారీ రంగానికి భారీగా ఊతమిచ్చాయని చెప్పారు.