బీహార్‌లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన ఆర్జేడీ, జేడీయూ త్వరలో విలీనం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు పార్టీలను ఒక్కటి చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి తాను జాతీయ రాజకీయాల పట్ల దృష్టి సారించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను కూడగట్టి ప్రధాని నరేంద్రమోదీని ఢీకొట్టబోయేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
తాను బిజెపి ఏజెంట్ అని చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు బీహార్ లో ఈ తమ కూటమి తిరిగి విడిపోయే అవకాశం లేదని స్పష్టమైన సంకేతం ఇవ్వడం కోసం రెండు పార్టీల విలీనం అత్యవసరం అని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
నితీష్ కుమార్ కుటుంభంలో రాజకీయాలలో వారసత్వంగా మరెవ్వరు లేకపోవడం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సహితం వృద్ధాప్య సమస్యలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడంతో తేజస్వి యాదవ్ కు రాష్ట్రంలో మార్గం సుగమం చేసేందుకు కూడా ఆ విధంగా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నది.
తాజాగా నితీశ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ తేజస్వియాదవ్‌ను ముందుకు నడిపించే సమయం వచ్చిందని చెప్పారు. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తున్నాననే కథనాలను నితీశ్‌కుమార్ ఖండిస్తూ వస్తున్నప్పటికీ ఆయన దృష్టి అంతా 2024 ఎన్నికల పైననే ఉన్నట్లు స్పష్టం అవుతున్నది.
ఇదిలావుంటే జేడీయూ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వేసిన పోస్టర్లో ఆ పార్టీ నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ సామాజిక న్యాయంతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది అని పేర్కొన్నారు.
బీహార్‌లో ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాలు ప్రధాన ఓటు బ్యాంకు కాగా, ఇతర బీసీ సామాజిక వర్గాలన్నీ జేడీయూ ఓటు బ్యాంకుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లలన్ సింగ్ తన పోస్టర్లో సామాజిక న్యాయం అనే పదాన్ని వాడటం ఆ రెండు పార్టీలు విలీనం కాబోతున్నాయనడానికి మరో సంకేతంగా నిలుస్తున్నది.