గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ జర్నలిస్ట్, టివి యాంకర్ ఇసుదాన్ గాధ్వీ (40) పేరును ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్ సిఎం అభ్యర్థి కోసం ఆప్ నిర్వహించిన సర్వేలో ఇసుదాన్ 73 శాతం ఓట్లను గెలుచుకున్నారు.
ఇసుదాన్ గాధ్వీ గతేడాది జూన్‌లో ఆప్‌లో చేరారు. రాజకీయ నేతగా మారక ముందు ఇసుదాన్ గాధ్వి జర్నలిస్టుగా పని చేశారు. వీటీవీ గుజరాతికి ఎడిటర్ గా వ్యవహరించిన ఆయన.. వీటివీ న్యూస్ కూ ఎడిటర్ గా పని చేశారు. అంతకుముందు వీటీవీలో ప్రసారమైన మహామంతన్ కు యాంకర్ గానూ వ్యవహరించారు. ఆప్ లో చేరిన తర్వాత జర్నలిజానికి స్వస్తి చెప్పారు.
న లాంటి సాధారణ, నిరాడంబర రైతు కుమారుడికి కేజ్రీవాల్ ఇంత పెద్ద బాధ్యత అప్పగించారని ఇసుదాన్ పేర్కొన్నారు. ఆప్ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా సిఎం అభ్యర్థిగా పోటీపడ్డారు. ఫోన్ నెంబర్ ద్వారా నచ్చిన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకునే విధానాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు.
గతంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కూడా ఇదే విధంగా సర్వే ద్వారా ఎంపిక చేశారు. గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, బిజెపి నుండి అధికార పగ్గాలు చేపట్టేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం యత్నిస్తోంది. గురువారం ఎన్నికల కమిషన్ గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కేజ్రీవాల్ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు.