స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ కుటుంబీలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్యామ్ శరణ్ నేగి తుది శ్వాస విడిచే వరకూ బాధ్యతాయుత పౌరుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చారని పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ ద్వారా శ్యామ్ ఓటు వేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. దీనిపై దేశంలోని ప్రతి పౌరుడు ఆలోచించుకోవాలని, శ్యామ్ శరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
శ్యామ్ నేగి హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ లో 1917 జులై 1న జన్మించారు. 1951 సాధారణ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు. అప్పటి నుంచి ప్రతిసారి తన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. 2014లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం యువ ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా శ్యామ్ శరణ్ నేగిని నియమించింది.
గత కొంతకాలంగా వయోధిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరణ్.. హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన కల్పాలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సంతాపం తెలిపారు. నేగి అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించారు.
నేగి అంత్యక్రియల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ పాల్గొననున్నారు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లోని నేగి స్వగ్రామమైన కల్పాకు సీఈసీ వెళ్లనున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.