రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని మనుగోడు ఉప ఎన్నకల ఫలితాల ద్వారా మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతమైందని, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని పేర్కొన్నారు.
సీపీఐ, సీపీఎం ప్రత్యక్షంగా, కాంగ్రెస్ తో పరోక్షంగా పొత్తు పెట్టుకుని పోటీ చేసినా, మనీ, మద్యం, మాంసం ఏరులై పారించినా, ఎన్నికల సంఘం అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకున్నా టీఆర్ఎస్ 10 వేలకు మించి మెజారిటీ ఓట్లు సాధించలేకపోయిందని సంజయ్ గుర్తు చేశారు. బీజేపీ సింహంలా సింగిల్ గా పోటీ చేసి గతంతో పోలిస్తే 7 రెట్లు అధికంగా 86 వేలకు ఓట్లు సాధించిందని చెప్పారు.
ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని చెబుతూ గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఓడిపోయినప్పడు కుంగిపోవడం, గెలిచినప్పుడు పొంగిపోం అని చెబుతూ బిజెపిని నమ్మి కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం పోటీ చేశారని తెలిపారు. దాడులు చేసినా, వెరవకుండా కష్టపడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అంటూ రాజగోపాల్ రెడ్డి యుద్దం చేశారని, హీరో లెక్క కొట్లాడినరని ప్రశంసించారు.
దాడులు, లాఠీఛార్జీలు, కేసులను ఎదుర్కొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు సెల్యూట్ చేశారు. నాయకులంతా సమష్టిగా క్రుషి చేయడంవల్ల గతం కంటే అత్యధికంగా 40 శాతానికి పైగా ఓట్లు సాధించామని సంజయ్ చెప్పారు.
ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే మునుగోడు సమస్యలన్నీ 15 రోజుల్లో పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నిర్ణీత గడువులోపు ఆ హామీలన్నీ అమలు చేయలేనిపక్షంలో బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదని సంజయ్ హెచ్చరించారు.
ఇతర పార్టీల నుండి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను అంగట్లో పశువుల్లెక్క కొన్నరని మండిపడుతూ దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలని టిఆర్ఎస్ నాయకులకు సవాల్ చేశారు.
. మునుగోడు ఎన్నికల గెలుపు కొందరు పోలీసుల, ఎన్నికల సంఘం అధికారులదే అని సంజయ్ ఆరోపించారు. పోలీసులే దగ్గరుండి డబ్బులు పంచారని, సొంత అవసరాల కోసం డబ్బులు తీసుకెళ్లిన బీజేపీ నేతల సొమ్మును పట్టుకుని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. వందల కోట్లు పంచిన టీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎందుకు పట్టుపడలేదో? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు వెయ్యి కోట్లు ఖర్చు చేసినా ఎన్నికల కమిషన్ ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. కాంగ్రెస్ కు బీజేపీ కంటే అధిక ఓట్లు రావాలని ఆ పార్టీ తరపున టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచారని, అయినా ప్రజలు టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమేనని ఆశీర్వదించారని తెలిపారు.