అత్యంత కీలకమైన జీ20 దేశాల కూటమికి డిసెంబరు 1 నుంచి భారత్ అధ్యక్షత వహించనుంది. ఈనేపథ్యంలో సరికొత్త థీమ్ తో కూడిన ‘జీ20’ లోగో, వెబ్ సైట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. లోగోలో ఉన్న కమలం పువ్వులో 7 రెమ్మలు ఉన్నాయని.. అవి ప్రపంచంలోని 7 ఖండాలకు ప్రతీకలని వివరించారు.
‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ నినాదంతో జీ20 కూటమిలో ముందుకుపోతామని ఆయన తెలిపారు. ఇంతకుముందు ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ నినాదంతో పునరుత్పాదక ఇంధన వనరుల విప్లవాన్ని సాధించే దిశగా కసరత్తును ప్రారంభించామని ప్రధాని మోడీ ఈసందర్భంగా గుర్తు చేశారు.
‘వన్ ఎర్త్, వన్ హెల్త్’ నినాదంతో ప్రజారోగ్య పరిరక్షణను ఉద్యమ స్థాయిలో చేపట్టామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జీ20 కూటమిని ప్రగతిశీలకంగా ముందుకు తీసుకెళ్లేందుకు ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ నినాదాన్ని చేపట్టామని ప్రధాని వివరించారు.
జీ20 కూటమికి అధ్యక్షత వహించే చారిత్రక అవకాశాన్ని భారతదేశం దక్కించుకోనున్న వేళ దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘వసుధైవ కుటుంబకం’ భావనతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 2023లో జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. ప్రపంచ జీడీపీలో 85 శాతం జీ20 దేశాల నుంచే వస్తోందని మోదీ గుర్తుచేశారు. మొత్తం ప్రపంచ జనాభాలో మూడింట రెండో వంతు కూడా జీ20 దేశాల్లోనే నివసిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇండోనేషియా జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తుండగా, ఆ పరంపరను వచ్చే నెలలో భారత్ అందుకోనుంది. జీ20 దేశాల ప్రెసిడెన్సీ సందర్భంగా భారత్ లో 200 సమావేశాలు జరగనున్నాయి. 32 విభిన్న రంగాలపై భారత్ లోని వివిధ చోట్ల ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుంది.