నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు హోంమంత్రి మహమూద్ అలీని సాక్షులుగా చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే హైకోర్టు ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బ్రుందాన్ని (సిట్)ను నియమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదే విషయంపై తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు.
అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు రావడం లేదు? మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు ఎందుకు వెల్లడించడం లేదు? ప్రగతి భవన్ లోనే ఎందుకు ఉంచినట్లు వివరణ ఇవ్వాలని కోరారు.
గతంలో కేసీఆర్ నయీం కేసు, ఇంటర్మీడియట్ పేపర్ లీక్, మియూపూర్ భూములు, డ్రగ్స్ కేసు వంటి అంశాలన్నింటిపైనా సిట్ వేశారు. కానీ ఆ విచారణలు ఏమయ్యాయి? కేవలం సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం తప్ప చేసిందేమిటి? ఎవరికి న్యాయం జరిగింది? అని నిలదీశారు.
కాగా, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు రామగుండం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందని అంటూ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రాభివ్రుద్ధి కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ వస్తున్నందున అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
తెలంగాణకు అన్యాయం జరిగింది…. కేంద్రం నిధులివ్వడం లేదని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్… అదే నిజమైతే ప్రధానమంత్రే స్వయగా రాష్ట్రానికి వస్తున్నారు కదా… ఆయనను నేరుగా కలిసి ఎందుకు అడగటం లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడానికైనా ప్రధాని పర్యటనను వేదికగా చేసుకోవచ్చు కదా అని హితవు చెప్పారు. అయినా రావడం లేదంటే ప్రధానికి ముఖం చూపలేకనే కమ్యూనిస్టులతో కలిసి ప్రధాన పర్యటనను అడ్డుకునే కుట్ర చేస్తున్నరని మండిపడ్డారు.
అసలు ప్రధాని పర్యటనను ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారో కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. సీఎంను ఆహ్వానించకుండా అవమానించారంటూ టీఆర్ఎస్ ద్రుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న కమ్యూనిస్టులు ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని చూడటం సిగ్గు చేటని విమర్శించారు.