ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఎప్పుడూ ధృడంగా వ్యవహరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దాడి జరిగిన ప్రాంతం, తీవ్రతను అనుసరించి స్పందన ఉండబోదని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ”నో మనీ ఫర్ టెర్రర్” సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఉగ్రవాదం మానవత్వం, స్వేచ్ఛ, నాగరికతపై దాడిగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికి ముప్పు కలిగించే ఉగ్రవాదంపై అన్ని దేశాలు స్పష్టమైన విధానం కలిగి ఉండాలని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విస్తరిస్తోన్న ఉగ్రవాదంపై పోరాడేందుకు అన్ని దేశాలు ఏకమవ్వాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు.
ప్రపంచం ఉగ్రవాదాన్ని తీవ్రంగా గుర్తించకముందే భారత్ తీవ్రమైన ఉగ్రవాద దాడులను ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. దశాబ్దాలకు పైగా ఉగ్రవాదం విభిన్న పేర్లతో, రూపాలతో భారత్‌ను దెబ్బతీయడానికి ప్రయత్నించిందని తెలిపారు. దీంతో వేలాది మంది విలువైన ప్రాణాలు కోల్పోయినప్పటికీ .. ఉగ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు.
ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు విశ్రమించబోమని ప్రధాని స్పష్టం చేశారు. కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆ దేశాలు వారికి రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయని చెబుతూ అటువంటి దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించాలని ప్రధాని సూచించారు.
టెర్రరిజం ఫైనాన్స్ మూలాలను దెబ్బ కొట్టాల్సిన అవసరాన్ని ప్రధాని స్పష్టం చేస్తూ నిరంతరం థ్రెట్ కింద బతకడం ఎవరికీ ఇష్టముండదని, దీని కారణంగా ప్రజల జీవనోపాధి దూరమవుతోందని చెప్పారు. ఉగ్రవాదాన్ని మానవత్వం, స్వేచ్ఛ, నాగరికతపై దాడిగా మోదీ అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముప్పుతో పోరాడేటప్పుడు సందిగ్ధ ధోరణికి చోటు లేదని పేర్కొన్నారు.
నేటి ప్రపంచంలో ఉగ్రవాదం ప్రమాదాల గురించి ప్రపంచానికి ఎవరూ గుర్తు చేయవలసిన అవసరం లేదని అంటూ కొన్ని సర్కిల్‌లలో ఇప్పటికీ ఉగ్రవాదం గురించి కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని మోదీ చెప్పారు. దాడులకు ప్రతిస్పందన తీవ్రత ఆధారంగా ఉండకూడదని, ఎక్కడ జరిగినా ఒకే రకమైన బాధ, ఆవేదన ఉంటాయని తెలిపారు.
ఉగ్రవాదులకు నిధుల నిరోధంపై జరుగుతున్న మూడో సదస్సు ఇది. అంతకుముందు 2018 ఏప్రిల్‌లో పారిస్‌లో జరగగా, 2019 నవంబరులో మెల్బోర్న్లో ఈ సదస్సులు జరిగాయి. వివిధ దేశాల మంత్రులు, మల్టిలేటరల్ ఆర్గనైజేషన్స్ అధిపతులు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రతినిధులతో సహా ప్రపంచవ్యాప్తంగా 450 మంది ప్రతినిధులు ఈ రెండు రోజుల సమావేశానికి హాజరవున్నారు.
కాన్ఫరెన్స్ సందర్భంగా.. గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్షింగ్, యూజ్ ఆఫ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఛానల్స్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ టెర్రరిజం, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ టూ అడ్రెస్ ఛాలెంజెస్ ఇన్ కాంబ్యాటింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్షింగ్ సవాళ్లను అధిగమించడంపై చర్చిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం దృఢసంకల్పం, విజయం సాధించడానికి తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తుంది.