ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
23 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు బిల్లులు, అంశాలపై చర్చిస్తామని తెలిపారు. నిర్మాణాత్మక చర్చ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు ఎలాంటి సెలవులు లేకుండా పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించనుంది. ముఖ్యంగా జిఎస్టి, రైతుల సమస్యలపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
23 రోజుల వ్యవధిలో జరగనున్న ఈ సమావేశాల్లో మొత్తం 17 పనిదినాలు ఉంటాయి. సమావేశాల మొదటి రోజు సిట్టింగ్ సభ్యుల మృతికి సంతాపం ప్రకటిస్తూ వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చనిపోయినవారిలో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు.
గత రెండున్నరేళ్లుగా పార్లమెంట్ సమావేశాలను కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లతో నిర్వహించారు. సభ్యుల మధ్య దూరం ఉండేలా పబ్లిక్ గ్యాలరీలో సందర్శకులను నిలిపివేసి సభ్యులను కూర్చోబెట్టారు. అలాగే ఉభయ సభల్లో సభ్యులను సర్దుబాటు చేసి సమావేశాలు నిర్వహించారు. దాంతో ఏకకాలంలో రెండు సభలు నిర్వహించడం సాధ్యపడలేదు.
అయితే కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత ఒకే సభలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి దాదాపుగా నియంత్రణలో ఉండడం, సభ్యులతో పాటు సిబ్బంది అందరూ టీకాలు పొంది ఉండడం వంటి కారణాలతో ఈసారి సమావేశాలను పెద్దగా ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేకుండానే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే సందర్శకులు, మీడియా ప్రతినిధులను అనుమతిస్తారా లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.