బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో రాష్ట్రంలోని పలు ఏరియాల్లో పాదయాత్ర చేపట్టిన సంజయ్ ఇప్పుడు ఐదో విడత యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 28 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.
ముథోల్ నుండి కరీంనగర్ వరకు ఈ పాదయాత్ర సాగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తామని, డిసెంబర్ 15 వరకు యాత్ర కొనసాగనుందని యాత్ర కో ఆర్డినేటర్ వీరేందర్ గౌడ్ తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలోని అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం యాత్ర ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన గోల్కొండ కిల్లాపై కాషాయ జండా ఎగుర వేస్తం అని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే సీఎం కుటుంబానికి కమిషన్ ఇవ్వాలి .. భాగ స్వామ్యం ఇవ్వాలి. కెసిఆర్ ఏ రోజు రాష్ట్రానికి లాభం జరగాలి అని ఆలోచించడు అని ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేంద్ర నిధులు దారి మల్లిస్తున్నాడని ఆరోపించారు.
పది లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు సాగుతుంది మోదీ ప్రభుత్వం అని ప్రకటించారు. కేంద్రం ఉద్యోగాలు ఇస్తుంటే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు తొలగిస్తుందని ఎద్దేవా చేశారు. ద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు… ప్రమోషన్ లు ఇవ్వకుండా రివర్సన్ లు ఇస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటివరకు బండి సంజయ్ యాత్ర నాలుగు విడతల్లో కొనసాగగా.. 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మొత్తం 21 జిల్లాల్లో 1, 178 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు.