ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అందున్నారు. గోవాలో జరుగుతున్న 53వ ఇఫీ చలనచిత్రోత్సవం సందర్భంగా ఈ విశిష్ట పురస్కారాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులమీదుగా చిరంజీవి అందుకున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అభిమానుల ప్రేమ తనను మెగాస్టార్‌ను చేసిందని, ఇవాళ ఇక్కడి వరకు నడిపించిందని, వారి ప్రేమకు తాను దాసుడ్ని అని చెప్పారు. తాను మెగాస్టార్ స్థాయికి చేరానంటే లైట్ బాయ్ నుంచి సినీ రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని చెప్పారు.
తనకు ఈ అవార్డు ప్రదానం చేసి.. గొప్ప గౌరవాన్ని అందించినందుకు ఇఫీ, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కొన్ని గుర్తింపులకు ప్రత్యేకమైన విలువ ఉంటుందని చెబుతూ ఈ పురస్కారం అలాంటిదని తెలిపారు. ప్రేక్షకులు తన పట్ల చూపుతున్న ఆదరాభిమానాలను జీవితాంతం కాపాడుకుంటానని చిరంజీవి చెప్పారు. మధ్య తరగతి కుటుంబంలో కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గా జన్మించిన తనకు సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చిందని పేర్కొన్నారు. దాదాపు 4 దశాబ్దాలకుపైగా సినీ రంగంలో ఉన్న తనకు రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమా రంగం విలువ ఏంటో అర్థమైందని చెప్పారు.
ఈ అవార్డుకు కారణమైన ప్రతి ఒక్కరికీ నిండు మనసుతో శిరసు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ‘‘అవినీతి లేని ఏకైక రంగం సినీ రంగం. ఇక్కడ టాలెంట్ ఉంటేనే ఎదుగుతాం. నాకు యువ హీరోలు పోటీ కాదు.. నేనే వాళ్లకు పోటీ. ప్రస్తుతం ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది. భవిష్యత్తులో భారతీయ సినిమా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని అవార్డు తీసుకునే ముందు పేర్కొన్నారు.