ముఖ్యమంత్రి కేసీఆర్ కు మూడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి ప్రజలను కష్టపాల్జేసిన కేసీఆర్ ఏం సాధించారని, ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే బైంసా పేరును మైసా (మహిషా) మారుస్తామని ప్రకటించారు. అన్ని పార్టీలకు అధికారమిచ్చారు.. ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వండని కోరారు.
అట్లాగే బైంసా బాధితులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని, ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అర్హులైన అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య-వైద్యం అందించడంతోపాటు నిలువనీడ లేని వాళ్లందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు.
బైంసా సమీపంలో జరిగిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ బహిరంగ సభకు బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, సోయం బాపూరావు, తదితరులు పాల్గొన్నారు. బైంసాకు రావాలంటే వీసా తీసుకోవాలా? ఏం పాపం చేశారన్న బైంసా ప్రజలు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైంసాలో పచ్చ జెండా మాత్రమే ఎగరేస్తామని ఉర్రూతలూగిన ఎంఐఎం లుచ్చానాకొడుకులున్న పాతబస్తీకి పోయి కాషాయ జెండాను రెపరెపలాడించి గాండ్రించినం అని గుర్తు చేశారు.
ఈరోజు బీజేపీని బైంసాకు రాకుండా నిషేధించారు? బైంసా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లో ఉందా? వీసా తీసుకుని రావాలా? మత విద్వేషాలు రగిలించే ఎంఐఎం నాయకులు ఎక్కడైనా తిరగొచ్చు… నా దేవతలను కించపర్చే మునావర్ ఫారుఖీ లాంటి వాళ్లు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చట… దేశం కోసం, ధర్మం కోసం హిందు ధర్మాన్ని కాపాడే బీజేపీ వాళ్లు మాత్రం సభలు పెట్టుకోవద్దట… ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ దేశంలో ఉన్నాం? అంటూ ప్రశ్నించారు.
ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడించాలె అని పేర్కొంటూ బీజేపీ ఏర్పడ్డాక బైంసాను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. “బైంసా ప్రజలారా… భయపడాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం మీ వెంట ఉంది. ఫాల్తుగాళ్లు 12 ఇండ్లు తగలబెడితే… కట్టించామా? లేదా? పీడీ యాక్ట్ పెడితే తొలగించినమా? లేదా?” అంటూ భరోసా ఇచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగమియ్యలేదాని చెబుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం పోయిన నెలలో ఒకేసారి 75 వేల మందికి, ఈనెలలో 70 వేల మందికి ఏకకాలంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారని సంజయ్ గుర్తు చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే పేదలందిరికీ ఉచిత విద్య-వైద్యం అందిస్తాం. నిలువనీడలేని పేదోళ్లందరికీ పక్కా ఇండ్లు నిర్మిస్తాం. అకాల వానలతో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్దమేనని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులకు మీ జైళ్లు సరిపోవని ఎద్దేవా చేశారు. మాట తప్పం.. మడమ తిప్పం అని సవాల్ చేశారు.
అసలు ఈ తెలంగాణలో శాంతి, భద్రతలున్నాయా.. ఈ పోలీసులు శాంతి, భద్రతల కోసం ఉన్నారా.. ప్రతిపక్షాలను అణిచివేయడం కోసం ఉన్నారా అని నిలదీశారు. ఇంతటి దుర్మార్గం ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్కసీటు రాదని తేల్చి చెప్పారు. మోడీ వస్తే ఫామ్ హౌస్ లో దాక్కునే కేసీఆర్.. ప్రధానిని గద్దె దించుతాడనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.