భారత్, చైనా బలగాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ నుంచి ఇరు సైన్యాల ఉపసంహరణ సమయంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు సేనలు కొట్లాటకు దిగిన ఈ చిన్నపాటి ఘర్షణలో ఇరువైపులా పలువురు సైనికులు, అధికారులకు స్వల్ప గాయాలయ్యాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
కాగా ఘర్షణ తర్వాత ఇరుదేశాల బలగాలు అక్కడి నుంచి ఎవరివైపు వారు వెనక్కి వెళ్లిపోయారని వెల్లడించాయి. తవాంగ్ సెక్టార్‌లోని యంగ్‌స్టే ప్రాంతంలో ఈ ఘర్షణ జరిగింది. ఈ ప్రతిష్ఠంభనలో ఆరుగురు భారతీయ సైనికులకు గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని గువహటి తరలించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద ఈ ప్రతిష్టంభన చోటుచేసుకుంది. చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటడాన్ని భారతీయ సైనికులు గట్టిగా ప్రతిఘటించారు. 300లకుపైగా మంది చైనా సైనికులు దాదాపు 17 వేల అడుగుల ఎత్తైన పర్వత శిఖరం మీదకు ఎక్కేందుకు ప్రయత్నించారు.
అక్కడున్న భారతీయ పోస్టును పెకిలించే ప్రయత్నం చేశారు. కానీ భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. అయితే ఘర్షణ తర్వాత ఇరుసేనలూ ఆ ప్రాంతం వెనక్కి వెళ్లిపోయాయని రక్షణ వర్గాలు తెలిపాయి. కాగా ఈ ప్రాంతమంతా మంచుపరచుకుని ఉంటుంది.
ఈ ప్రాంతంలోని కొన్ని భాగాలపై ఇరుదేశాలు తమవిగా పేర్కొంటున్నాయి. 2006 నుంచి ఇరుదేశాల మధ్య ఈ వివాదం నడుస్తున్నది.మీడియా కథనాల ప్రకారం, ఈ ఘర్షణ 17 వేల అడుగుల ఎత్తులో జరిగింది. చైనా సైనికులు దాదాపు 300 మంది ఉండగా.. భారత సైనికుల సంఖ్య కూడా దాదాపు అంతే ఉన్నది.
గతేడాది 200 మంది చైనా సైనికులు ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా భారత సైనికులు విజయవంతంగా అడ్డుకున్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటల పాటు ఫేస్ టు ఫేస్ ఘర్షణ కొనసాగింది. ఇందులో భారత సైనికులకు ఎలాంటి నష్టం జరగలేదని, ప్రొటోకాల్ ప్రకారం చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకున్నట్లుగా తెలుస్తున్నది.
కాగా, 2020 జూన్ 15న లడఖ్‌లోని గాల్వన్ లోయలో ఇరుసైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించగా, 38 మంది చైనా సైనికులు చనిపోయారు. నలుగురు సైనికులే చనిపోయినట్లు చైనా చెప్తూ వస్తున్నది.