తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ వారసత్వ రాజకీయాలలో మరో ముందడుగు వేశారు. తన కుమారుడుని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ సీటీ రవి సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తో మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్ సహా, పలువురు డిఎంకే నాయకులు హాజరయ్యారు. ఉధయనిధికి సీఎం స్టాలిన్ రాష్ట్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖను కట్టబెట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి ఉధయనిధిని తీసుకోవాలంటూ ఇటీవల డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసుకు గవర్నర్ సీటీ రవి ఆమోదం తెలిపారు.
తమిళ నటుడు, నిర్మాత, పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి కూడా అయ్యారు. డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) యువజన విభాగం కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉధయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
