పశ్చిమ్ బెంగాల్లోని బీర్భూమ్ హింసాత్మక అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు లలన్ షేక్ సీబీఐ కస్టడీలో అనుమానాస్పదరీతిలో సోమవారం మృతి చెందడంతో సీబీఐ అధికారులపై బెంగాల్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 22న బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో ఓ మహిళ, చిన్నారులు సహా 10 మంది సజీవదహనమయ్యారు.
ఈ కేసులో లలన్ షేక్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. లలన్ మృతిపై పశ్చిమ్ బెంగాల్ పోలీసులను నమోదుచేసి ఎఫ్ఐఆర్ను కలకత్తా హైకోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ సవాలు చేసే అవకాశం ఉందని సమాచారం. లనన్ను డిసెంబరు 4న ఝార్ఖండ్లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యాంపులో లలన్ను ఉంచి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అతడు అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. సీబీఐ అధికారులు చిత్ర హింసలకు గురిచేయడం వల్లే లలన్ చనిపోయాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు, రూ.50 లక్షలు ఇస్తే ఈ కేసు నుంచి తన భర్త పేరును తొలగిస్తామని సీబీఐ అధికారులు అన్నట్టు లలన్ భార్య ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను తోసిపుచ్చిన సీబీఐ.. నిరాధారణమైనవి ఖండించింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు లలన్ మృతిపై దర్యాప్తు ప్రారంభించింది.
కాగా, బొగ్తుయ్లోని ఇళ్లకు నిప్పంటించిన అల్లరి మూకకు షేక్ నాయకత్వం వహించినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో చనిపోయివారిని అంతకు ముందు తీవ్రంగా హింసించినట్టు పోస్టుమార్టం నివేదిక బయటపెట్టింది. మార్చి 22న రాంపూర్హట్ ప్రాంతంలోని బర్షాల్ గ్రామ పంచాయతీలో టీఎంసీ నేత బదు షేక్ బాంబు దాడిలో చనిపోగా.. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పంటించారు. ఈ ఘటనల్లో కనీసం 10 మంది సజీవదహనమయ్యారు.
10 నుంచి 12 ఇళ్లకు టీఎంసీ కార్యకర్తలు నిప్పంటించారు. దీంతో మంటల్లో చిక్కుకుని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బదు షేక్ హత్యకు భూ లావాదేవీలు, అక్రమ వ్యాపారం, దోపిడీ సొమ్ములో వాటా విషయంలో ఆయన సహచరులకు మధ్య ఏర్పడిన వైరమే కారణమని కోర్టుకు సమర్పించిన చార్జ్షీట్లో సీబీఐ పేర్కొంది.