భారత్ దాయాది దేశాలు చైనా..పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యం కలిగి ఉండటం, ఇటీవల చైనా నుంచి చొరబాటు ప్రయత్నాలు ఎక్కువగా చోటు చేసుకుంటుండడంతో ఆ రెండు దేశాల సరిహద్దుల్లో ప్రళయ్ క్షిపణులను మోహరించాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది.
శత్రు దేశాల నుంచి మన దేశం వైపు దూసుకొచ్చే క్షిపణులను వీటితో అడ్డుకోవచ్చని శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 2015లో భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ ఈ ప్రళయ్ క్షిపణులను అభివృద్ధి చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణులు సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా చేస్తాయి.
శత్రు దేశాలు ప్రయోగించిన క్షిపణులను కూల్చేసే ప్రయత్నంలో అవసరాన్నిబట్టి గాలిలోనే దిశను మార్చుకోగలిగే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది. మిస్సైల్ గైడెన్స్ వ్యవస్థతో పాటు అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ ప్రళయ్ క్షిపణులను తయారు చేసినట్లు డీఆర్డీవో వర్గాలు తెలిపాయి.
గత ఏడాది ఈ క్షిపణులను పరీక్షించిన ఆర్మీ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. కాగా చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యాధునిక క్షిపణులను కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అత్యున్నత స్థాయి సమావేశంలో 120 ప్రళయ్ క్షిపణుల కొనుగోలుకు ఆమోద ముద్ర వేసింది. డీఆర్డీవో సొంతంగా తయారుచేస్తున్న ఈ క్షిపణుల రేంజ్ 100 కి.మీ. నుంచి 500 కి.మీ. వరకు ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ప్రళయ్.. ఒక సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు, ఇతర కొత్త సాంకేతికతలతో ఆధారితమైనది. క్షిపణి మార్గదర్శక వ్యవస్థలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నావిగేషన్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉన్నాయి. ఈ క్షిపణిని మొదట భారత వైమానిక దళంలో చేర్చవచ్చు, తర్వాత భారత సైన్యంలో ఉంటుంది.