చైనాలో కరోనా విలయతాండవం చేస్తూ, రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పలు దేశాలు అక్కడి నుంచి విదేశాలకు వెళ్లే వారికి ఆంక్షలు విధిస్తోంది. తమ దేశాల్లోకి రావాలంటే కచ్చితంగా కరోనా నెగెటివ్ రిపోర్టు ఉండాలని సూచిస్తుంది.
తాజాగా స్వదేశీ, విదేశీయుల పై చైనా ప్రయాణ ఆంక్షలను సడలించగా.. అక్కడి నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే భారత్, జపాన్, మలేషియాలు.. డ్రాగన్ కంట్రీ నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరింది.
చైనాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. చైనా నుంచి వచ్చేవారు నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాలన్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అమెరికా తెలిపింది. చైనా నుంచి నేరుగా కాకుండా సియోల్, టొరంటో, వాంకోవర్ మీదుగా వచ్చే ప్రయాణికులకు కూడా ఇదే షరతు వర్తిస్తుందని వెల్లడించారు.
మరోవంక, చైనా, మరో ఐదు దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్టును సమర్పించాలనే నిబంధనను తీసుకురానున్నది. దీనిలో భాగంగా అంతర్జాతీయ ప్రయాణికులు సువిధ ఫామ్‌లను నింపడం, 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు సమర్పించడం తదితర నిబంధనలు వచ్చేవారం నుంచి తేనున్నది. చైనా, జపాన్, సౌత్ కొరియా, హాంగ్‌కాంగ్, థాయిలాండ్, సింగపూర్ నుంచి వచ్చేవారికి దీనిని అమలు చేయనున్నారు. కాగా, విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఇప్పటికే కొవిడ్ ర్యాండమ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
ఇలా ఉండగా, భారత తయారీ సిరప్‌ను తాగి గాంబియాలో 70 మంది చిన్నారులు మృతి చెందిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో జరిగింది. నోయిడాలోని మారియన్ బయోటెక్ తయారు చేసిన ‘డాక్-1 మ్యాక్స్’ సిరప్‌ను తాగి 18 మంది చిన్నారులు మరణించినట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. సిరప్‌ను ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బాధిత చిన్నారులకు ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఈ మరణాలు సంభవించినట్టు తేలిందని పేర్కొంది. సిరప్‌లో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు లేబరేటరీ పరీక్షల్లో వెల్లడైందని పేర్కొంది.