ప్రధాని నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ (100) శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. తల్లి మరణంతో ప్రధాని మోడి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరారు. మరోవైపు ఈరోజు ప్రధాని పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నట్లు సమాచారం. హీరాబెన్ మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తన తల్లి హీరాబెన్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ” నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా ” అని ప్రధాని ట్విటర్లో పేర్కొన్నారు.
గాంధీనగర్ కు సమీపంలోని రయ్సాన్ గ్రామంలో పిఎం నరేంద్ర మోడీ సోదరుడు పంకజ్ మోడీతో కలిసి హీరాబెన్ ఉంటున్నారు. గుజరాత్ పర్యటనకు వచ్చినప్పుడు పిఎం మోడీ తన తల్లిని కలుసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి ఆరోగ్యంగా తిరిగి రావాలని ధర్మయాత్ర మహాసంఘ్ కార్యకర్తలు ఓ దేవాలయంలో మహా మృత్యుంజయ మంత్రం జరిపించారు. భద్రినాథ్, కేదార్ నాథ్ దేవాలయంలో హీరాబెన్ త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. వృద్ధాప్యంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో హీరాబెన్ మోదీ గత కొన్నేళ్లుగా బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం శ్వాసకోస సంబంధిత సమస్యతో ఆమె ఆస్పత్రిలో చేరారు.
తల్లి అనారోగ్యానికి గురైన సమాచారం తెలుసుకున్న మోదీ.. హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌లోని ఆస్పత్రికి చేరుకున్నారు. తల్లి ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హీరాబెన్‌కు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.