ప్రజాప్రతినిధుల భావప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమిష్టి బాధ్యత సూత్రాన్ని వర్తింపచేసినప్పటికీ ఓ మంత్రి ప్రకటనను ప్రభుత్వానికి వర్తింప చేయలేమని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
బహిరంగ వేడుకలు, సమావేశాల్లో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల భావప్రకనటనా స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించాలంటూ దాఖలైన పిటిషన్పై నేడు జస్టిస్ ఎస్.ఎ. నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (2) కింద పేర్కొన్నవి తప్ప ఏ పౌరుడి వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా ఎలాంటి అదనపు పరిమితులు విధించలేమని తెలిపింది.
రాష్ట్ర వ్యవహారాలు లేదా ప్రభుత్వాన్ని రక్షించడం కోసం ఒక మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని అన్నారు. ఆర్టికల్ 19(1)(ఎ) కింద ఉన్న ప్రాథమిక హక్కును రాష్ట్రం కాకుండా ఇతర సాధనాలకు వ్యతిరేకంగా కూడా ఉపయోగించవచ్చని జస్టిస్ బి.ఆర్.గవై, జస్టిస్ ఎ.ఎస్ బోపన్న, జస్టిస్ వి. రామసుబ్ర మణియన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
” ద్వేషపూరిత ప్రసంగం సమాజాన్ని అసమానంగా మార్చడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. భారత్ దేశంలో ఇది విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన పౌరులపై దాడి చేస్తుందని అన్నారు.
