ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరగడంతో శుక్రవారం జరగవలసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగకుండానే సమావేశం ముగిసింది. ఉదయం మేయర్ ఎన్నిక కోసం సమావేశమైన ఢిల్లీ మున్పిపల్ కార్పొరేషన్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది.
ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సభ్యుడిని కాకుండా, వేరొక సభ్యుడిని ప్రిసైడింగ్ స్పీకర్‌గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడంపై ఆప్ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రొటెం స్పీకర్ సత్య శర్మను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభ్యులెవరీనీ ప్రమాణస్వీకారం చేయనీయలేదు. ఈ క్రమంలో బీజేపీ, ఆప్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు సభ్యులు మైకులు, కుర్చీలను విరగొట్టారు. ఈ ఘటనలో కొందరు సభ్యులకు గాయాలయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ ఎన్నిక నిర్వహించకుండానే సభ వాయిదా పడింది.
డిసెంబరులో జరిగిన 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజెపిని నెట్టివేసి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 250 స్థానాలకు గాను 134 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 104 స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్ కు కేవలం 9 సీట్లు లభించాయి.
మేయర్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడైన ముకేశ్ గోయెల్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించగా బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించడంతో వివాదం ప్రారంభమైంది. పైగా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా 10 మంది నామినేటెడ్ సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నియమించారు.
సత్య శర్మ సభలోకి చేరుకొని ఎన్నికైన వారితో కాకుండా ముందుగా నామినేట్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించడం ప్రారంభించడంతో ఆప్ సభ్యులు ఆగ్రహం చెందారు. దీంతో ఆప్, బీజేపీ కౌన్సిలర్లు ఒకరినొకరు తోసుకుంటూ, బిగ్గరగా అరుస్తూ, నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు.