“ప్రపంచ సంక్షేమం కోసం విశ్వవిజ్ఞాన శాస్త్రం” పేరిట రూపొందించిన ఈ సంవత్సరపు “జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం-నేషనల్ సైన్స్ డే” ఇతివృత్తాన్ని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేసారు. నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో విజ్ఞాన శాస్త్ర దినోత్సవ ఇతివృత్తాన్ని ఆయన ఆవిష్కరించారు.
కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, దేశం 2023లోకి ప్రవేశిస్తున్నందున ప్రస్తుత తరణంలో విజ్ఞాన శాస్త్ర రంగంలో పెరుగుతున్న భారతదేశం పాత్రను, అంతర్జాతీయ రంగంలో నిర్వహించవలసిన భూమికను సైన్స్ దినోత్సవ ఇతివృత్తం తెలియజేస్తున్నదని తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవ ఇతివృత్తం, అధ్యయన అంశానికి, కార్యక్రమాలకు సంబంధించి గట్టి మార్గనిర్దేశం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రపంచ సంక్షేమం కోసం విశ్వ విజ్ఞానశాస్త్రం” అనే ఇతివృత్తం, జి-20 దేశాల అధ్యక్ష పదవిని భారతదేశం చేపట్టడానికి అనుగుణంగా ఉండటం అభినందనీయమని, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో పాటు, ప్రపంచంలోని దక్షిణాది వర్ధమాన దేశాల వాణికి ప్రతిరూపంగా భారతదేశం తయారవుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ప్రధాని మోదీ నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం ప్రపంచ దృష్టిని గణనీయంగా ఆకర్షించిందని ప్రపంచ స్థాయిలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారం లక్ష్యంగా ఫలితాల ప్రాతిపదికన ప్రపంచ స్థాయి సహకారానికి తాము సంసిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి చెప్పారు. ఆందోళనలు, సవాళ్లు, ప్రమాణాలు ప్రపంచ స్థాయికి చేరినపుడు, పరిష్కారాలు కూడా ప్రపంచ స్థాయిలోనే అదే ప్రమాణాలతో దీటుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణ సంస్మరణార్థం ప్రతియేటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం 1986లో ప్రకటించింది. తాను రామన్ ఎఫెక్ట్ అన్న సిద్ధాంతాన్ని కనుగొన్నట్టు సర్ సి.వి. రామన్ అదే రోజున ప్రకటించారు. ఇందుకోసం ఆయనకు 1930లో ప్రతిష్టాత్మక భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. సైన్స్ డే సందర్భంగా దేశమంతటా ప్రత్యేక ఇతివృత్తం ప్రాతిపదికగా విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలను, ఇనేక ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తారు