ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కేరళలోని మున్నార్‌లో ఉష్ణోగ్రత ఈ శీతాకాలంలో తొలిసారిగా బుధవారం సున్నా కంటే తక్కువకు పడిపోయింది. సమీపంలోని చెందువార, వట్టవాడ తదితర ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చలి ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
సాధారణంగా డిసెంబర్లో మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అయితే ఈసారి వర్షం కారణంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని మున్నార్‌కు చెందిన సురేష్ తెలిపారు.”ఈ శీతాకాలంలో మున్నార్‌లో ఇంత తీవ్రమైన చలిని అనుభవించడం ఇదే మొదటిసారి” అన్నారాయన.
మున్నార్‌లోని కన్నిమల, చెందువార, చిటువార, ఎల్లపెట్టి, లక్ష్మి, సేవాన్మల, లాకట్తో సహా పలు ప్రాంతాల్లో నిన్న మైనస్ ఒక డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా మంది పర్యాటకులు ఉదయం మంచుతో కప్పబడిన పచ్చిక బయళ్లను సందర్శించారు. కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామమైన వట్టవాడలోనూ చలి తీవ్రత నమోదైంది.
బుధవారం ఉదయం వట్టవాడలో కనిష్ట ఉష్ణోగ్రత సున్నా కంటే దిగువకు పడిపోయింది. మున్నార్ కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఒక హిల్ స్టేషన్. ఇక్కడ సాధారణంగా డిసెంబర్లో మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. విపరీతమైన చలిని ఫీల్ కావడానికి చాలా మంది పర్యాటకులు మున్నార్‌ను సందర్శిస్తున్నారు.
మరోవంక, ఈ వారం ఉత్తర భారతంలో ఉష్ణోగ్రత బాగా పడిపోయింది. వచ్చే వారం కల్లా ఉత్తర భారతంలో మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగలదని ఓ వాతావరణ నిపుణుడు తెలిపారు. జనవరి 14 నుంచి19 వరకు తీవ్ర చలిగాలులు వీచనున్నాయి.కాగా జనవరి 16 నుంచి 18 మధ్య అవి తీవ్ర స్థాయిని చేరుకోనున్నాయని నవదీప్ దహియా ట్వీట్ చేశారు. ఆయన ‘లైవ్ వెధర్ ఆఫ్ ఇండియా’ వ్యవస్థాపకుడు. 21వ శతాబ్దిలో ఇదే అత్యంత శీతల కాలం కాగలదని ఆయన తన ట్వీట్లో తెలిపారు.
గత కొన్ని వారాలుగా రాత్రి పూట చలి తీవ్రంగా ఉంటోంది. 23 ఏళ్ల తర్వాత ఇదే అత్యంత చలికాలం అని ఆయన పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉండింది. ఇదివరలో 2006లో, 2013లో ఇంతలా చలి ఉండిందని మరో వాతావరణ నిపుణుడు ఆర్కె. జెనమని ఓ వార్తా సంస్థకు తెలిపారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ యూపి, ఉత్తర రాజస్థాన్ లో అక్కడక్కడ చినుకులు కూడా పడవచ్చని జెనమని తెలిపారు.