గత ఏడాది ఓ టివి డిబేట్ సందర్భంగా ముస్లింల ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది బిజెపి నుండి సస్పెండయిన ఆ పార్టీ ప్రతినిధి నూపూర్ శర్మకు ఇప్పుడు గన్ లైసెన్సు ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తన భద్రతకు ముప్పు ఉన్నందువల్ల వ్యక్తిగతంగా తనతోపాటు ఓ తుపాకీని తీసుకెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె చేసిన దరఖాస్తుపై సానుకూలంగా స్పందించారు.
జ్ఞానవాపి కేసు విచారణ సమయంలో నూపుర్ శర్మ గత ఏడాది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేగింది. దీంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. అనంతరం ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
తన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను గాయపరచేందుకు కాదని, శివలింగాన్ని ఎగతాళి చేస్తూ ఓ ప్యానెలిస్ట్ మాట్లాడటంతో తాను తిప్పికొట్టడం కోసమే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. అయినప్పటికీ ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశాన్ని తగులబెట్టారని దుయ్యబట్టింది. దేశంలో జరుగుతున్నదానికి ఆమె మాత్రమే బాధ్యురాలని స్పష్టం చేసింది. కానీ ఆమెపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులన్నిటినీ ఢిల్లీలోనే విచారణ జరిగేలా గత ఏడాది ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆమెను హత్య చేస్తామంటూ పలువురు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో తనకు వ్యక్తిగత తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని నూపుర్ శర్మ ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేశారు. ఆమె భద్రతకు ముప్పు ఉన్నట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు ఆమె దరఖాస్తుకు ఆమోదం తెలిపారు. వ్యక్తిగతంగా తుపాకీని తీసుకెళ్లేందుకు ఆమెకు అనుమతి ఇచ్చారు.