రాజౌరీలో జరిగిన ఉగ్రదాడులపై ఎన్ఐఎ దర్యాప్తు చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖా మంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రదాడులపై జమ్మూ అధికారులతో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా హాజరయ్యారు.
సమావేశం అనంతరం అమిత్‌షా మీడియాతో మాట్లాడుతూ ‘రాజౌరీ ఉగ్రదాడుల్లో చనిపోయిన ఏడుగురి మృతుల కుటుంబాలతో ఫోన్లో మాట్లాడాను. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ధైర్యం దేశానికే ఉదాహరణగా నిలుస్తుంది’ అని తెలిపారు.
రాబోయే రోజుల్లో అత్యంత సురక్షితమైన గ్రిడ్‌ను రూపొందించేందుకు జమ్మూకాశ్మీర్‌లోని బిఎస్ఎఫ్, సిఆర్డిఎఫ్, ఆర్మీ వంటి ఏజెన్సీలతోనూ చర్చించామని చెప్పారు. ఇందులో భాగస్వామ్యయ్యేందుకు అన్ని ఏజెన్సీలు, పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
రాజౌరీలో జరిగిన ఘటనలపైనే కాకుండా.. గత ఏడాదిన్నర కాలంలో జరిగిన అన్ని ఘటనలపై విచారణ జరిపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. జనవరి 1-2 తేదీల్లో జరిగిన దాడులపై ఎన్ఐఎ బృందం, పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తారని అమిత్‌షా తెలిపారు.
కాగా, జమ్మూలోని దంగ్రీ గ్రామంలో జనవరి 1-2 తేదీల్లో వరుసగా ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు పిల్లలతో సహా, ఏడుగురు పౌరులు మృతి చెందారు.