మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ అంశంపై ప్రధాని మోడీకి లేఖ రాశానని.. తనని బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లుగా చెప్పారు. మహారాష్ట్ర కు గవర్నర్‌గా సేవలందించడం గౌరవంగా భావిస్తున్నట్లు భగత్ సింగ్ కోశ్యారీ తెలిపారు.
గవర్నర్ గా తనపై రాష్ట్ర ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. ఇటీవల ముంబై పర్యటనకు ప్రధాని మోడీ వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని మోడీతో పంచుకున్నట్లు చెప్పారు. అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని అనుకున్నట్లు వివరించానని వెల్లడించారు.
తన మిగిలిన జీవితాన్ని పుస్తకాలు చదవడం, రాయడం వంటి వాటితో గడపాలనుకుంటున్నాని తెలిపారు. ప్రధాని మోదీకి తనంటే ఎంతో అభిమానమని.. తన నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తారనుకుంటున్నట్లు కోశ్యారీ చెప్పారు. విద్యాసాగర్ రావు తర్వాత మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన భగత్ సింగ్ కోశ్యారీ..అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.
గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచిపెట్టి పోతే..రాష్ట్రంలో డబ్బు మిగలదని, దేశంలో ఆర్థిక రాజధానిగా ఉండే అర్హత ముంబై కోల్పోతుందంటూ వ్యాఖ్యానించారు. అలాగే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీని పాత రోజుల్లో ఐకాన్‌గా భావించేవారని..కానీ ఇప్పుడు అంబేద్కర్, గడ్కరీని ఐకాన్‌గా భావిస్తున్నారని చెప్పారు.
దీంతో పాటు.. 2019లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడణవీస్‌తో తెల్లవారుజామునే ప్రమాణస్వీకారం చేయించారు. అటు మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం నామినేట్ చేసిన 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోశ్యారీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.