ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోలగట్ల మీనాక్షి, తెలంగాణకు చెందిన గౌరవి రెడ్డితో పాటు మొత్తం 11 మంది బాలలు 2023 సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి జాతీయ బాలల పురస్కారాలు అందుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందుకున్నారు.
చిన్న వయస్సులో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి దేశానికి పేరు తీసుకొచ్చిన బాలలను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో అంతర్జాతీయ చందరంగం క్రీడాకారిణి కోలగట్ల ఆలన మీనాక్షి 2022 అక్టోబర్‌లో ప్రకటించిన ర్యాంకింగ్స్ 11 ఏళ్ల లోపు వయసు కేటగిరీలో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచింది.
క్రీడల విభాగంలో మీనాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాతీయ బాలల పురస్కారానికి ఎంపికైంది. మరోవైపు ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్ కు 2016లో నామినేటైన నృత్యకారిణి ఎం. గౌరవి రెడ్డి అతిచిన్న వయస్సులో ఈ ఘనత సాధించి రికార్డుల్లోకి ఎక్కింది.
అనేక వేదికలపై శాస్త్రీయ నృత్యరీతులు ప్రదర్శిస్తూ పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో గౌరవి రెడ్డిని కళలు – సంస్కృతి విభాగంలో తెలంగాణ రాష్ట్రం తరఫున బాలల పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. ఈ ఇద్దరితో పాటు వివిధ విభాగాల్లో చిన్న వయస్సుల్లోనే విశేష ప్రతిభ కనబర్చిన బాలలకు ఈ పురస్కారం దక్కింది.
పురస్కారం అందుకున్న బాలలు: 1. ఆదిత్య సురేష్ – కేరళ – ఆర్ట్ కల్చర్; 2. ఆదిత్య ప్రతాప్ సింగ్ చౌహాన్ – ఛత్తీస్‌గఢ్ – ఇన్నోవేషన్; 3. జాలీ – ఢిల్లీ – సామాజిక సేవ; 4. హనయా నిసార్ – జమ్ము – క్రీడలు; 5. కోలగట్ల మీనాక్షి – ఆంధ్రప్రదేశ్-క్రీడలు; 6. గౌరవి రెడ్డి – తెలంగాణ – కళలు, సంస్కృతి; 7. రిషి శివ ప్రసన్న – ఆవిష్కరణ – కర్ణాటక; 8. రోహన్ రామచంద్ర – ధైర్యం – మహారాష్ట్ర; 9. సంభవ్ మిశ్రా – ఒడిషా – కళా సంస్కృతి; 10. శౌర్యజిత్- గుజరాత్- క్రీడలు; 11. శ్రేయా భట్టాచార్య – అస్సాం – కళ & సంస్కృతి