రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం కోర్టు ఆదేశాలిచ్చినా పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడమంటే ముమ్మాటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని స్పష్టం చేశారు.
మహిళా గవర్నర్ ను అడుగడుగునా అవమానిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల సీఎంలను పదేపదే ఆహ్వానిస్తున్న కేసీఆర్ కు ఆయా రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలకు గవర్నర్లను ఆహ్వానించొద్దని, గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని చెప్పే దమ్ముందా? అని సవాల్ విసిరారు.
దేశంలో సగర్వంగా తలెత్తుకుని తిరిగేలా రూపొందించిన అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? తలదించుకుని బానిసల్లాగా బతికే కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. అంబేద్కర్, ప్రధాని నరేంద్రమోదీ స్పూర్తితో ప్రజాస్వామిక తెలంగాణ కోసం బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మువ్వెన్నెల పతకాన్ని ఎగరేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తదితరులు హాజరయ్యారు.
తెలంగాణలో మాత్రం రాజ్యాంగంపై భిన్నంగా రాజ్యాంగ విరుద్ధంగా పాలన జరుగుతోందని సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రికి కోర్టులంటే, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. అంబేద్కర్ అంటే గౌరవం లేదు. గవర్నర్, మహిళలంటే అసలే గౌరవం లేదు. గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడానికి కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని విమర్శించారు.