కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు.ఎవరి కొంప ముంచాలి? ఎవరిని నాశనం చేయాలి? అని క్షుద్రపూజలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇతరుల నాశనం కోరుకునేవాడు బాగుపడదని విమర్శించారు.
ఆదివారం కొండగట్టు ఆంజనేయస్వామివారిని దర్శించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొండగట్టు, ధర్మపురి, వేములవాడ ఆలయాల అభివృద్ది చేస్తానని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇస్తానన్న నిధులు ఎక్కడ? అని ప్రశ్నించారు.
బీజేపీ ఆధికారంలోకి వస్తే కొండగట్టు, ధర్మపురి, వేములవాడ ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్లు చొప్పున రూ.400 కోట్లు ఇస్తామని, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రూ.100 కోట్లు, కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి 2 నెలలు కావొస్తున్నా.. పైసా ఇవ్వలేదని సంజయ్ విమర్శించారు.
కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతితో వేల కోట్లు సంపాదిస్తున్నారని, దొంగ దందాలు చేసి కోట్లు కూడబెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అయితే, తెలంగాణ ప్రజలను మాత్రం బికారులను చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కార్యకర్తల పోరాట ఫలితంగా త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో పేదల రాజ్యం రాబోతోందని సంజయ్ జోస్యం చెప్పారు. ‘కేసీఆర్ నోటి నుండి ఏ దేశం పేరొచ్చినా.. అది అవుట్ అవుతోంది. పాకిస్తాన్, శ్రీలంకలో తిండి లేక జనం కొట్టుకుచస్తున్నరు. పాకిస్తాన్లో గోధుమ పిండి కోసం ఒకరినొకరు చంపుకుంటున్నరు. చైనా కరోనాతో అల్లాడుతోంది’ అని విమర్శించారు.
కాగా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.