తొలిసారి జరిగిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ ను టీం ఇండియా గెల్చుకుంది. సుదీర్ఘకాల నిరీక్షణకు తెరదించుతూ.. అరంగేట్ర అండర్ 19 ప్రపంచకప్‌లోనే అద్భుత విజయాన్నందుకుంది.
దక్షిణాఫ్రికాలో ఆదివారం జరిగిన ఫైనల్లో షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత అండర్19 మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మహిళల క్రికెట్లో ఏ విభాగంలోనైనా భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం.
సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయంతో ఫైనల్ చేరిన షఫాలీ బృందం.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ అండర్-19 బాలికల జట్టు.. 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. నలుగురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.
రియానా మెక్‌డొనాల్డ్ (19) టాప్ స్కోర్‌గా నిలిచింది. మన బౌలర్లలో టిటాస్ సధు, అర్చన దేవి, పార్షవి చోప్రా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
ఇక.. 69 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కి దిగిన షఫాలి వర్మ టీమ్.. దీటుగా ఆడింది. ఈ క్రమంలో కెప్టెన్ షఫాలీ (15), శ్వేత (5) పరుగులకు అవుటయ్యారు. ఇక ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సౌమ్యా తివారి 24*, గొంగడి త్రిష (24) పరుగులతో మాంచి ఆటతీరు కనబరిచారు.
మరో వికెట్ కోల్పోకుండా స్కోరు బోర్డుని పరుగులు పెట్టించే క్రమంలో త్రిష 24 పరుగుల వద్ద అవుటయ్యింది. సౌమ్యకి తోడుగా హ్రిషితా బసు 0* క్రీజులోకి చవ్చింది. దీంతో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా అమ్మాయిల అండర్ 19 జట్టు వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది.