ప్రభుత్వం రాసిచ్చింది చదివిన గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమైన ధరణి ప్రస్తావన లేదని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ విస్మయం వ్యక్తం చేశారు. దేశంలోనే భూ ప్రక్షాళన పేరుతో ధరణి అని హడాహుడి చేసిన ప్రభుత్వం దానిలోని తప్పులను సరిచేయడం లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది రైతుల సర్వే నెంబర్లు తప్పుతడకలతో ఉన్నాయని పేర్కొంటూ, దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యల గురించి కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదని చెప్పారు.
వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని ఆయన విమర్శించారు. విద్యుత్ కోసం రైతులు వ్యవసాయ క్షేత్రాలలో జాగారం చేస్తునారని, రైతాంగం గురించి ప్రభుత్వం ఆలోచించాలని ఈటెల కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా పేదలకు ఇళ్ళను కట్టించలేదని స్పష్టం చేశారు.
కేంద్రం ఇచ్చిన హడ్కో నిధులతో సిద్ధిపేట, గజ్వెల్ వంటి పట్టణాల్లో మాత్రమే నామమాత్రంగానే ఇళ్ళను నిర్మించారని ఆయన విమర్శించారు. గత రెండు నెలలుగా ఎస్ఐ, కానిస్టేబుళ్ళ అభ్యర్ధులు నిరసన తెలుపుతుంటే వాళ్ళ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆయన ఆరోపించారు.
గవర్నర్ తో అసత్యాలు చెప్పించారు
ఇన్నాళ్లు గవర్నర్ ని, రాజ్యాంగాన్ని అవమానపరచిన సీఎం కేసీఆర్ ఈ రోజు రాష్ట్ర ఉభయసభలను ఉద్దేశించి ఆమెతో అసత్యాలు చెప్పించారని అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.
ముఖ్యంగా రైతులకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నదనడం పచ్చి అబద్దమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ 1 లక్ష కోట్లు వెచ్చించి కాళేశ్వరం నిర్మించినా ఆయకట్టు ఏమాత్రం పెరగనప్పటికీ 73. లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం పెరిగినది పేర్కొనడం దుర్మార్గమని విమర్శించారు.