మహారాష్ట్రలోని నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మండిపడ్డారు. ‘‘ఇయ్యాల కేసీఆర్ చెప్పిన మాటలు విని జనం నవ్వుకుంటున్నారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సి వస్తే… ఇయ్యాల కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు ఆస్కార్ అవార్డ్ కచ్చితంగా దక్కేది” అని ఆయన విమర్శించారు.
‘‘నాందేడ్ లో బీఆర్ఎస్ సభ తుస్సుమంది. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసి ఏర్పాట్లు చేసినా సభ అట్టర్ ఫ్లాప్ అయింది. మహారాష్ట్ర జనం అస్సలు పట్టించుకోలేదు. చివరకు తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి జనాన్ని తరలించారు” అని సంజయ్ పేర్కొన్నారు.
పెద్ద పెద్ద నాయకులు చేరుతారని మొదట ప్రచారం చేసుకున్నా, చివరకు అవుట్ డేటెడ్ నాయకులే చేరారని ఎద్దేవా చేశారు. ‘‘ఇయ్యాల సభలో బీఆర్ఎస్ పార్టీ కాదు మిషన్ అని కేసీఆర్ చెప్పారు. నిజమే బీఆర్ఎస్ ఒక అవినీతి మిషన్.. ఫ్యామిలీ మిషన్.. కమీషన్ల మిషన్” అని విమర్శించారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని సంజయ్ విమర్శించారు. ‘‘ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ చెబుతున్నారు. మరి కేసీఆర్ తన తొలి కేబినెట్ లో మహిళకు మంత్రిగా ఎందుకు అవకాశం ఇవ్వలేదు? మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను ఎందుకు నియమించలేదు? నామినేటెడ్ పోస్టుల్లో, ఇప్పుడున్న ఎంపీల్లో ఒక్కరైనా మహిళ ఉన్నారా?” అని ప్రశ్నించారు.
‘‘మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యల గురించి కేసీఆర్ ప్రస్తావించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. తెలంగాణ జనాభాతో పోలిస్తే మహారాష్ట్ర జనాభా మూడు రెట్లు ఎక్కువ. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో సగటున రెండ్రోజులకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇవన్నీ దాచిపెట్టి రైతులను ఉద్ధరిస్తానని కేసీఆర్ చెబుతుంటే… తెలంగాణ రైతులు నవ్వుకుంటున్నారు” అని ధ్వజమెత్తారు.
రైతు బంధు పేరుతో సబ్సిడీలన్నీ బంద్ పెట్టిన కేసీఆర్ మాటలు వింటుంటే.. ‘‘రైతును కత్తితో పొడిచి, అయ్యో నొప్పి ఉందా?’’ అని అడిగినట్లుందని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రైవేటు పరమైన సంస్థలన్నింటినీ ప్రభుత్వ పరం చేస్తాననడం మరో పెద్ద జోక్ అని సంజయ్ విమర్శించారు. ‘‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ, రియాన్ ఫ్యాక్టరీలను ఉద్ధరించడమే చేతగాని కేసీఆర్.. దేశంలో ప్రైవేటుపరమైన పెద్ద పెద్ద సంస్థలను ప్రభుత్వ పరం చేస్తానంటే నమ్మేదెవరు” అని విమర్శించారు.
‘‘దేశమంతా ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తామంటూ కేసీఆర్ చెబుతున్నారు. కానీ నాందేడ్ పక్కనున్న ఆదిలాబాద్ జిల్లాలోనే మిషన్ భగీరథ అమలు కావడం లేదు” అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఆవాస్ యోజన కింద పేదలకు 15.32 లక్షల ఇండ్లు కట్టించారు. మరి తెలంగాణలో ఎన్ని ఇండ్లు కట్టిచ్చారో కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం లిక్కర్ ఆదాయంలో మహారాష్ట్రను మించిపోయిందని, నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరిగాయని, పెట్రో రేట్లు అధికంగా ఉన్నాయని మండిపడ్డారు.’