తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కేవలం మోడీని తిట్టడానికి, బీజేపీపై నిందలు వేయడానికి మాత్రమే పెట్టుకున్నారని బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డా. కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో విపక్షాలకు అధికార పార్టీ సమయమివ్వడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆరోపించారు. ఆడలేక మధ్యలో ఓడినట్టు కేంద్రంపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. 9 ఏళ్ల వార్షిక బడ్జెట్లు ఏనుగు తొండంలా.. కేటాయింపులు మాత్రం ఎలుకంత ఉన్నాయని విమర్శించారు.
ప్రజలను భ్రమల్లోకి నెట్టేశారన్న లక్ష్మణ్… తెలంగాణలో మహిళా సంఘాలు పొదుపు చేసుకున్న సొమ్ముకు వడ్డీ లేదని చెప్పారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉందని.. కానీ ప్రభుత్వం మాత్రం ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటోందని ఎద్దేవా చేశారు.
“కేటీఆర్ తమది 4 కోట్ల కుటుంబ పాలన అంటున్నారు… నాలుగు కోట్ల మంది వాళ్ల కుటుంబం అయితే, నలుగురికి మాత్రమే మంత్రి పదవులు ఎందుకు” అని లక్ష్మణ్ ప్రశ్నించారు.
కాగా, సీఎం కేసీఆర్ అబద్దాల కోరు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు..కేసీఆర్ ప్రభుత్వం అబద్దాల మీదనే నడుస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ అబద్దాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ నిజస్వరూపం బట్టబయలు కాబోతుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ మోసాలను, అబద్దాలను వినేందుకు తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా లేరని చెబుతూ కేసీఆర్ దేశ నాయకుడంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నాయకుడు కావాలంటే ప్రజల్లో ఆ భావన రావాలని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి. వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. చివరి బడ్జెట్లోనూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు, పేదల ఇండ్ల విషయంలో కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు.
రుణమాఫీ చేస్తామని నాలుగేళ్ల పాటు రైతులను ఊరించి చివరి బడ్జెట్లో వెన్నుపోటు పొడిచారని వివేక్ ఆరోపించారు. ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆశలు సన్నగిల్లాయని.. కేసీఆర్ దుకాణం బందైందని అన్నారు. అందుకే బడ్జెట్ గురించి కాకుండా పొలిటికల్ స్పీచ్ మాత్రమే ఇచ్చారని వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీయేనని, ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకువచ్చారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులలో 70 – 80 % నిధులు విడుదల కావని పేర్కొంటూ బడ్జెట్ లో చాలా శాఖలకు కోతలు పెట్టారని ఆరోపించారు.
నాలుగేళ్లయిన రైతాంగానికి రుణమాఫీ చేయలేదన్నారు. మధ్యాహ్నం భోజనం వండే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారని, అది కూడా రెండేళ్లకోసారి ఇస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో ముక్కిపోయిన ఆహారం అందుతుందని తెలిపారు.
హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సరుకు,సంగతి లేని డబ్బా బడ్జెట్ అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.. తెలంగాణ బడ్జెట్ అంతా అంకెల గారడీ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ మాటల్లో చెప్పాలంటే సరుకు లేదు, సంగతి లేదు. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.