గవర్నర్ ప్రసంగంపై మంత్రి కె. తారకరామారావు, బడ్జెట్ పై మంత్రి హరీష్‌రావులు అసెంబ్లిలో మూడు గంటల సమయం ప్రసంగించి సమావేశాలను పార్టీవేదిక మార్చారని హుజూరాబాద్ బిజెపి ఎంఎల్ఏ ఈటెల రాజేందర్ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం అసెంబ్లిలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మంత్రి హరీష్‌రావు చేసిన ప్రసంగం అబద్దాలతో నిండిపోయిందని ధ్వజమెత్తారు.
రూ 13 వేల కోట్లు భూములు అమ్మకం ద్వారా వస్తాయని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 25 వేల కోట్లు సహాయం కింద వస్తుందనడం, జిఎస్టీ కాంపెన్సేషన్ వస్తుందని చెప్పడం అబద్దమని ఆయన ఆరోపించారు. రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అప్పులు చేస్తున్న రాష్ట్రంగా మారిందని, ఎఫ్ఆర్బిఎం, గ్యారెంటి రుణాలు కలిపి అప్పుల కింద రూరూ. 5 లక్షల కోట్టుకు చేరుకుందని ధ్వజమెత్తారు.
గతంలో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ఉచితంగా మంచి భోజనం పెట్టారని, ప్రస్తుతం వాటి పరిస్థితి సోష్ వెల్ఫేర్ హాస్టళ్ళకన్నా దారుణంగా మారిందని విమర్శించారు. రూ 3 లక్షల కోట్లు బడ్జెట్ అని ఘనంగా చెప్పుకుంటున్న మీరు ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు ఎందుకు చెల్లించలేక పోతున్నారని ప్రశ్నించారు.
గత సంవత్సరం వృద్దులకు ఇవ్వాలన్ని పెన్షన్ ఎగ్గొట్టింది ,మహిళలకు రూ 4200 కోట్లు వడ్డీలేని రుణం బాకి అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెనిఫెస్టో చిత్తుకాగితం కాదు… భగవద్గీతతో సమానం అని చెప్పిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రూ.24 కోట్లు రుణమాఫి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వాలేదని ప్రశ్నించారు.
కేవలం రైతుబంధు ఇచ్చి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టివేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అబ్కి సర్కార్ కిసాన్ సర్కార్ అని చెబుతున్న మాటలకు తెలంగాణ ప్రజలు బొల్తాపడరన్నారు. విఆర్ఏలు, విఆర్వోలు,గ్రామ కార్యదర్శులు, విఏవోలు,ఐకేపి సిబ్బందికి గతంలో సీఎం రంగుల ప్రపంచం చూపారని ఎద్దేవా చేశారు.
గత సంవత్సరం బడ్జెట్లో దళిత బందు కింద రూ.17,700 కోట్లు పెట్టిన మీరు నేటి వరకు ఒక్క రూపాయి అయినా ఖర్చుచేశారా? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ వరకు మీ ప్రభుత్వం ఉంటుందని, మరి రెండు లక్షల కోట్ల రూపాయలను ఎప్పుడు ఖర్చుచేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులకు వచ్చే నిధులు వారి ద్వారానే ఖర్చు చేస్తున్నా.. ఎంఎల్ఏల చేతికి మాత్రం నిధులు ఇవ్వకుండా సంకుచితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.