తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాల జాబితాలో ఉన్న దాదాపు 40 కులాలకు జాతీయ ఓబీసీ జాబితాలో చోటు కల్పించకపోవడంతో జాతీయస్థాయిలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో నష్టపోతున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ తెలిపారు.
గురువారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) ఛైర్మన్ హంసరాజ్ గంగారాం ఆహిర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర నేత జే. సంగప్ప, వీరశైవ లింగాయత్ ప్రతినిధులు ఉన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన డా. లక్ష్మణ్.. జాతీయ స్థాయిలో ఓబీసీ జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్న వర్గాలకు కూడా ఫలాలు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో బీసీ జాబితాలో ఉన్న 40 కులాలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
అన్ని వర్గాలకు ప్రభుత్వ ప్రయోజనాలు, ఫలాలు అందించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని, ఇదే మాదిరిగా వీరశైవ లింగాయత్ సహా ఓబీసీ జాబితాలో చోటులేని మిగతా బీసీ కులాలకు న్యాయం జరిగేలా తాను ప్రత్యేక దృష్టి పెడతానని వెల్లడించారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ కులాన్ని జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు సైతం కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్‌ను బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్, తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు గురువారం ఢిల్లీలో కలిశారు.
అనంతరం బీబీ పాటిల్ మాట్లాడుతూ వీరశైవ లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చకపోవడం వల్ల అనేక అవకాశాలను కోల్పోతున్నామని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి తనకు గతంలోనూ చాలా విజ్ఞప్తులు వచ్చాయని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కమిషన్ ఛైర్మన్ హామీ ఇచ్చినట్టు బీబీ పాటిల్ వెల్లడించారు.