దేశ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే పోలీసు వ్యవస్థ, ప్రజల నమ్మకం పొందిన పోలీసు వ్యవస్థ,సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యం గల పోలీసు వ్యవస్థ కలిగి ఉన్న దేశం మాత్రమే అభివృద్ధి సాధిస్తుందని పేర్కొంటూ దేశాభివృద్ధికి పోలీసు వ్యవస్థ పునాదిగా పనిచేస్తుందని కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 74 ఆర్ఆర్ ఐపీఎస్ బ్యాచ్ స్నాతకోత్సవంలో పాల్గొంటూ రాజ్యాంగ విలువలు గౌరవిస్తూ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని శిక్షణ పూర్తి చేసుకున్న అధికారాలకు సూచించారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా మూడు వ్యవస్థలు దేశానికి అవసరమని పేర్కొన్నారు.
ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, దేశానికి 30 నుంచి 35 సంవత్సరాల పటు సేవ చేసే అధికార యంత్రాంగం మూడు స్తంభాలుగా ఉంటాయని చెప్పారు. ‘ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసే అధికారం ప్రజలకు ఉంటుంది. అయిదేళ్ల పాటు దేశాభివృద్ధికి పనిచేసి పదవీ కాలం ముగిసిన తర్వాత తిరిగి ప్రజల మద్దతు కోసం ప్రజా ప్రతినిధులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, 30-35 సంవత్సరాల వరకు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే అదృష్టం అఖిల భారత సర్వీసుల అధికారులకు మాత్రమే ఉంటుంది’ అని ఆయన గుర్తు చేశారు.
రానున్న 25 సంవత్సరాలు దేశానికి అత్యంత ప్రధానమైన సంవత్సరాలని పేర్కొంటూ ఈ కాలంలో శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులపై దేశ అంతర్గత భద్రతను రక్షించాల్సిన బాధ్యత ఉందని అమిత్ షా చెప్పారు. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి అధికారులు చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ‘ రానున్న 25 సంవత్సరాలు’ సంకల్ప సిద్ధి’ సంవత్సరాలుగా ఉంటాయని పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల క్రితం దేశ అంతర్గత భద్రత ఆందోళనకరంగా ఉండేదని జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద ఘటనలు, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు, వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో పెరుగుతున్న హింస రూపంలో మూడు ప్రధాన సవాళ్లు ఎదురయ్యాయని కేంద్ర హోం మంత్రి గుర్తు చేశారు. ‘ 8 ఏళ్ల తర్వాత ఈ మూడు సవాళ్లను చాలా వరకు ఎదుర్కోవడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద ఘటనలు గణనీయంగా తగ్గాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు తిరుగుబాటు సంస్థలతో శాంతి ఒప్పందం కుదిరింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించడం ద్వారా 8,000 మందికి పైగా తీవ్రవాదులు తిరిగి ప్రధాన స్రవంతిలోకి వచ్చారని ఆయన వివరించారు. భద్రతా వ్యవస్థను పటిష్టం చేసి, వామపక్ష తీవ్రవాద సమస్యకు కారణమైన నాయకత్వాన్ని అణచి వేయడం తో వామపక్ష తీవ్రవాద సమస్య ప్రస్తుతం 46 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యిందని పేర్కొన్నారు. గతంలో 96 జిల్లాల్లో వామపక్ష తీవ్రవాద సమస్య ఉండేదని తెలిపారు. శాంతి స్థాపనతో ఈశాన్యంలో కొత్త శకానికి నాంది పలికిందని ఆయన చెప్పారు.