జమ్ము కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. పూర్వపు జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతంలో నియోజకవర్గాల సర్దుబాటును నిర్వహించేందుకు పునర్విభజన కమిషన్‌కు అధికారాన్ని కట్టబెట్టిన జమ్ము కాశ్మీర్ పునర్విభజన చట్టంలోని నిర్దిష్ట నిబంధన రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్లు సవాలు చేయలేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓఖాలతో కూడిన బెంచ్ పేర్కొంది.
శ్రీనగర్ వాసులు హజి అబ్దుల్ ఖాన్, డాక్టర్ మహ్మద్ అయూబ్ మట్టూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. జమ్ము కాశ్మీర్ పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ 2020 మార్చిలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను, అలాగే 2021 మార్చిలో కమిషన్ కాలపరిమితిని పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లను మాత్రమే వారు సవాలు చేశారని తెలిపారు.
ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడానికి మూలమైన సెక్షన్ 62(2)ను పిటిషనర్లు ఎందుకు సవాలు చేయలేదంటూ కోర్టు, విచారణ సందర్భంగా వారిని ప్రశిుంచింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టేందుకు భారత ఎన్నికల కమిషన్‌కు మాత్రమే సాధికారత వుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు.
పైగా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా ఈ ప్రక్రియను నిర్వహించడాన్ని రాజ్యాంగంలోని 170వ అధికరణ నిషేధిస్తోందనివారు బెంచ్‌కు తెలియజేశారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా జరగాలని లేదా 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల వరకైనా ఆగాలని వారు వాదించారు.