గ్రామాల అభివ్రుద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కరానికి నిధులివ్వాలని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
మహేశ్వరం నియోజకవర్గం అమీర్ పేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలోని పంచాయతీల అభివ్రుద్ధికి నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే. మీ లెక్క (బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి) నరేంద్రమోదీ గారు బీజేపీలోనే చేరితేనే పంచాయతీలకు నిధులిస్తామని చెబితే… బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా?’’అంటూ ప్రశ్నించారు..
బీఆర్ఎస్ పార్టీ ముంచిన ఫైనాన్స్ కొత్త దుకాణమే అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు కార్యవర్గమే లేదు. ఇతర రాష్ట్రాల నుండి బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులంతా చెల్లని కాసులు. మునుగోడు ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో బూత్ కు ఒక్కో ఎమ్మెల్యే, మంత్రిని నియమించిన టీఆర్ఎస్ కు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ చాలని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టానికే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మీటింగులు పెట్టి బీజేపీ దమ్మేందో చూపిస్తున్నామని తెలిపారు. మహేశ్వరంలో టీఆర్ఎస్ నేతల భూ కబ్జాలకు అంతు లేకుండా పోయిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 2.4 లక్షల ఇండ్లకు నిధులిస్తే… కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టకుండా నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు.
ఇంటికో ఉద్యోగమిస్తానని… అప్పటిదాకా ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తానని మాట కేసీఆర్ ను నిలదీయండని పిలుపిచ్చారు. రుణమాఫీ ఇస్తానని హామీ ఇచ్చి రైతులను నట్టేట ముంచిన ఘనుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలు చేయకపోవడంతో కొత్త అప్పులు పుట్టక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి నష్టపోతున్నారని చెప్పారు.
రైతులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులు అందజేస్తోందని చెబుతూ ఎకరాకు సగటున రూ.30 వేల మేరకు సబ్సిడీపై యూరియా అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నా… రాష్ట్రంలో రైతులకు వర్తింపజేయకుండా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.