లవ్ జిహాద్ చట్టం కింద ఉత్తర్ ప్రదేశ్ లో మొట్టమొదటి తీర్పు వెలువడింది. ‘లవ్ జిహాద్’ చట్టం కింద మొదటిసారి కాన్పూర్ యువకుడికి 10 ఏళ్ల జైలు, రూ.30వేల జరిమానా విధిస్తూ కాన్పూర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
జావేద్ అనే ముస్లిం యువకుడు తనను తాను మున్నాగా పరిచయం చేసుకొని, ఒక బాలికను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత జావేద్ బాలికను తీసుకొని పారిపోయాడు. ఈ సంఘటన 2017 మే నెలలో జరిగింది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మరుసటి రోజు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తనకు కాబోయే భర్త ఇంటికి చేరుకున్నప్పుడే జావేద్ ముస్లిం అని తెలిసిందని, నిఖా చేసుకుందామని అడిగాడని, దానికి తాను నిరాకరించానని బాలిక పోలీసులకు తెలిపింది.
తనపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని కూడా ఆమె ఆరోపించింది. దీంతో జావేద్‌పై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
తప్పుడు పేరు చెప్పి బలవంతం చేయడం, మోసపూరిత మార్గాల ద్వారా ఏ వ్యక్తి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒక మతం నుంచి మరో మతంలోకి మారకూడదని యుపి చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ 2020 చట్టం వివరిస్తోంది.
కాగా, ఈ చట్టం కింద యుపి పోలీసులు ఇప్పటివరకు మొత్తం 108 కేసులను నమోదు చేశారు. యుపిలోని బరేలీ జోన్లో 28 కేసులు, మీరట్ జోన్లో 23, గోరఖ్‌పూర్ జోన్లో11, లక్నో జోన్లో తొమ్మిది, ఆగ్రా జోన్లో 9 కేసులు నమోదయ్యాయి.