దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడంలో విశాఖపట్నంలో రెండురోజులపాటు జరిపిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 రెండోరోజు సదస్సులో ముగింపు ఉపన్యాసంలో రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధిచెందేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు తమ ప్రభుత్వం నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌తో సహకారం కోసం మరిన్ని అవకాశాలు అన్వేషించేందుకు యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలతో మరో నాలుగు సెషన్లు కూడా నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సు అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
అంతేకాదు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఈ సదస్సు కల్పించిన వాతావరణం ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సదస్సులో భాగంగా మేం పెట్టిన ఎగ్జిబిషన్ ఎరీనా ప్రత్యేకంగా అందర్నీ ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (ఒన్ డిస్ట్రిక్ట్ – ఒన్ ప్రొడక్ట్) థీమ్ ఆధారంగా 137 స్టాళ్లను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశామని వివరించారు.
ఈ రెండు రోజుల సదస్సులో రాష్ట్రంతో 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రెండో రోజు రూ. 1.17 లక్షల కోట్ల విలువైన 260 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. మొదటి రోజున, ఏపీ ప్రభుత్వం రూ. 11,87,756 లక్షల కోట్ల విలువైన 92 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. వీటి వల్ల రాష్ట్రానికి రూ.13,05,663 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు దక్కినట్లయ్యింది.
మొత్తం పెట్టుబడుల్లో ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ.8,84,823 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని వల్ల లక్షా 90 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఐటీ రంగంలో 56, టూరిజంలో 117 ఎంఓయూలు జరిగాయి. ప్రధాన పెట్టుబడిదారులలో, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రూ.2,35,000 కోట్ల పెట్టుబడితో 77,000 మందికి ఉపాధి కల్పించే 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.