దేశాభివృద్ధి ప్రక్రియలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ముఖ్యమైన పాత్ర వహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వశాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కలిసి నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మాట్లాడుతూ ఈ ఏడాది బడ్జెట్ మౌలిక సదుపాయాల రంగానికి కొత్త వృద్ధి శక్తినిస్తుందని చెప్పారు.
దేశాభివృద్ధి ప్రక్రియలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎల్లప్పుడూ మూలస్తంభంగా వుంటుందని పేర్కొంటూ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద రాబోయే కాలంలో రూ. 110 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని చెప్పారు. ప్రతి వాటాదారునికి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు, సాహసోపేతమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఈ వెబినార్‌లో ప్రధాని మోడీ ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.
‘మునుపటి ప్రభుత్వాలు దేశంలోని మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అదే ఈ ప్రభుత్వం పేదరికం, ఆధిపత్యం ఆలోచనను తొలగించేందుకు మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తోంది. 2014తో పోలిస్తే నేడు జాతీయ రహదారుల సగటు వార్షిక నిర్మాణం రెట్టింపు అయింది’ అని ప్రధాని తెలిపారు.
2014కి ముందు ప్రతి సంవత్సరం 600 రూట్ కిలోమీటర్ల రైలు మార్గం విద్యుదీకరించబడేది. నేడు అది దాదాపు 4,000 కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు. విమానాశ్రయాల సంఖ్య 2014కి ముందు 74 ఉంటే.. ఇప్పుడు దాదాపు 150 వరకు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను హైలెట్ చేశారు. గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఆర్థిక, మౌలిక సదుపాయాల ప్రణాళిక, అభివృద్ధిని ఏకీకృతం చేయడానికి ఒక గొప్ప సాధనం అని పేర్కొన్నారు. దేశంలో సామాజిక మౌలిక సదుపాయాలు ఎంత పటిష్టంగా ఉంటే.. ప్రతిభావంతులైన, నైపుణ్యం ఉన్న యువతకు అంతగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
మౌలిక సదుపాయాలు ఎంత బలంగా ఉంటే.. యువత పనిచేయడానికి అంతగా ముందుకు వస్తారు. అందుకే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఫైనాన్స్ స్కిల్స్‌పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని ప్రధాని సూచించారు.