ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రిమాండ్‌ను కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌పై విచారణను వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 10న విచారణ జరుపనున్నది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత ఆదివారం సీబీఐ ఆయనను అరెస్టు చేసిన విషయం విధితమే.
ఆ తర్వాత ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా ఐదు రోజులు సీబీఐ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. శనివారంతో సీబీఐ కస్టడీ ముగియడంతో ఆయనను సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. మరో మూడు రోజుల సీబీఐ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. విచారణకు సిసోడియా సహకరించడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
మనీష్ సిసోడియా తరఫు న్యాయవాది దయాన్ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ సీబీఐ వాదనలను ఖండించారు. దర్యాప్తులో సీబీఐ అసమర్థత కారణంగా రిమాండ్‌ను పొడిగించాలని కోరడం సరికాదని పేర్కొన్నారు. నిర్దోషిగా నిరూపించుకోవాలని మనీష్ సిసోడియాను పదేపదే కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
విచారణకు సహరించడం లేదని చెప్పడాన్ని తప్పుపట్టిన సిసోడియా న్యాయవాది ఆ కారణంగా రిమాండ్ గడువు పెంచాలని కోరడం సరికాదని తెలిపారు. మరోవైపు బెయిల్ పిటిషన్‌పై మార్చి 15న విచారణ జరపాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. దీన్ని సిసోడియా తరఫు న్యాయవాది వ్యతిరేకించడంతో మార్చి 10కి వాయిదా వేసింది కోర్టు.
ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రెండు రోజులు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు వాదనలను విననున్నట్లు పేర్కొంది.