ప్రపంచ టెక్స్టైల్ మార్కెట్లో భారత్‌ను బలమైన భాగస్వామిగా చేసేందుకు తెలంగాణతో పాటుఏడు రాష్ట్రాల్లో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం మిత్ర) పథకం ముఖ్య ఉద్దేశం ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం అని మోదీ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9ని సాధించడం కోసం దీన్ని రూపొందించినట్లు చెప్పారు. దీంతో టెక్స్టైల్ రంగంలో స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఆవిష్కరణలు, పారిశ్రామికీకరణ ప్రోత్సాహం సాధ్యమని తెలిపారు.
పీఎం మిత్ర పథకంలో మెగా టక్స్‌టైల్ పార్కులను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. వీటి నిర్మాణానికి మొత్తం రూ. 4,445 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణానికి అనుకూలంగా అత్యాధునిక సౌకర్యాలతో వీటిని నిర్మిస్తామని పేర్కొన్నారు.
వీటి ఏర్పాటులో దేశీయంగా, అంతర్జాతీయంగా టెక్స్టైల్ రంగం ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటి ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయని, అంతర్జాతీయ విపణిలో దేశీయ వస్త్రాల వాటా పెరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, రూ.కోట్లలో పెట్టుబడులను కూడా ఆకర్షించవచ్చని చెప్పారు.
ఒక్కో పార్కు ద్వారా లక్ష మందికి ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు పరోక్షంగా మరో రెండు లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉంటుందని పెక్రోన్నారు. బహుముఖ అభివృద్ధితో పాటు ఈ రంగంలో గణనీయమైన మార్పుకు శ్రీకారం అవుతుందన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్‌కు ఇది గొప్ప ఉదాహరణ అని ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. 5 ఎఫ్ విజన్‌తో ముందుకు వెళ్లనున్నట్లు మోదీ చెప్పారు. ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ దిశగా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.
స్పిన్నింగ్, ప్రొసెసింగ్, డైయింగ్, ప్రింటింగ్, గార్మెంట్ తయారీ అంతా ఒకే ప్రదేశంలో జరుగుతుందన్నారు. భారత్‌లో టెక్స్టైల్ రంగానికి ఊతమివ్వడానికి ఈ విజన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీంతో టెక్స్టైల్ రంగంలో ఎఫ్‌డీఐ, దేశీయ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని వివరించారు.
కాగా, తెలంగాణ రాష్ట్రానికి ‘పిఎం మిత్ర మెగా టెక్స్టైల్స్ పార్క్’ను ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.