హిదూత్వంపై అభ్యంతరకర ట్వీట్ చేసిన కన్నడ నటుడు చేతన్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. హిందుత్వపై ఆయన చేసిన ట్వీట్ వైరల్ కావడంతో చేతన్‌ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
అసత్యాలపై హిందుత్వ నిర్మాణమైంది అంటూ చేతన్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ‘అసత్యాలపై హిందుత్వ నిర్మాణమైంది. రావణుడిని ఓడించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాతే భారత జాతి అనేది మొదలైందని సావర్కర్ చెప్పారనేది ఒక అసత్యం. బాబ్రీ మసీదే రాముడి జన్మస్థలం అని పేర్కొనడం ఒక అసత్యం’ అంటూ రాసుకొచ్చాడు.
దీంతోపాటుగా హిందుత్వను కేవలం నిజం మాత్రమే ఓడించగలదని, ఆ నిజం సమానత్వం అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. చేతన్ ట్వీట్‌పై హిందుత్వ అనుకూల సంస్థ అతనికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన శేషాద్రిపురం పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, చేతన్ కుమార్ ఇలా చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. 2022 ఫిబ్రవరిలోనూ ఆయన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి క్రిష్ణ దీక్షిత్ పై చేసిన అభ్యంతరకర ట్వీట్ కారణంగా అప్పట్లో పోలీసులు నటుడిని అరెస్టు చేశారు.