తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్పీ) పేపర్ లీకేజీ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు తెలిపారు.
టీఎస్ పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నందుకు వారికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.
స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా టీఎస్పీఎస్సీ ఏర్పాటైందని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఈ వాస్తవాలు అన్నిటినీ పక్కనపెట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్ తెరలేపారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
టీఎస్ పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం వెనక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుతంత్రం దాగి ఉందని కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారని ఆయన గుర్తు చేశారు.
చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు, వాళ్ల కుటిల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.