పరారీలో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృతపాల్ ను సిక్కుల అత్యున్నత సంస్థ అకాల్ తఖ్త్ హెచ్చరించింది. పోలీసుల ఎదుట లొంగిపోయి, విచారణకు సహకరించాలని అమృత్పాల్ను హెచ్చరించింది. ఈ మేరకు అకాల్ తఖ్త్ జత్యేదార్ జ్ఞాని హర్ప్రీత్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అలాగే ఆయన పోలీసుల సామర్థ్యంపై కూడా ప్రశ్నలు కురిపించారు. అంతపెద్ద దళం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అమృత్పాల్ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అమృత్పాల్ బయటపడితే పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలని కోరేవాడినని హర్ప్రీత్ తెలిపారు.
పంజాబ్లో అంతమంది పోలీసులున్నా అమృత్పాల్ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని ప్రపంచ వ్యాప్తంగా సిక్కుల మదిలో ఓ ప్రశ్న మెదులుతోందని ఆయన చెప్పారు. ఈ ఘటన పోలీసుల పనితీరుపై కూడా సందేహాలను రేకెత్తిస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితిపై చర్చించేందుకు దాదాపు 70 సిక్కు సంస్థలతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు హర్ప్రీత్ తెలిపారు.
ఒక వేళ అతనిని ఇప్పటికే అరెస్టు చేస్తే పోలీసులు ఆ వివరాలను ప్రకటించాలని కోరారు. అలాగే అమృత్పాల్ కేసులో అరెస్టయిన సిక్కు యువకులు పోలీసులు అంచనా వేసినట్లుగా పెద్ద నేరాలు చేయలేదని సూచించారు. అయితే ఇప్పటికే తమ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అమృతపాల్ తల్లిదండ్రులు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవంక, అమృత్ పాల్ కు ఆశ్రయమిచ్చిన మరో మహిళను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అమృత్ పాల్, ఆయన అనుచరుడు పాపల్ సింగ్ హర్యానాలోని కురుక్షేత్రకు వెళ్లేముందు పాటియాలాలో ఆగారని.. వాళ్లకు ఈ నెల 19న బల్బీర్ కౌర్ అనే మహిళ షెల్టర్ ఇచ్చిందని పోలీసులు తెలిపారు. అందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాగా, ఇంతకుముందు కురుక్షేత్రలో అమృత్ పాల్ కు ఆశ్రయమిచ్చిన బల్జీత్ కౌర్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.