ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ డే పంజాబ్ చీఫ్ అమృత్పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు జోగా సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామీణ అమృత్సర్, హోషియార్పూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన కార్యకలాపాల్లో ఆయనను అరెస్ట్ చేశారు. అమృత్పాల్, జోగా మార్చి 18 నుంచి 28 వరకు కలిసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బోర్డర్ రేంజ్ డీఐజీ నరీందర్ భార్గవ్ శనివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, అమృత్పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు జోగా సింగ్ను సిర్హింద్లో అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మార్చి 18 నుంచి 28 వరకు కలిసి ఉన్నారు. గ్రామీణ అమృత్సర్, హోషియార్పూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన కార్యకలాపాల్లో ఆయనను అరెస్ట్ చేశారు.
వారిస్ డే పంజాబ్ కార్యకర్తలపై పంజాబ్ పోలీసులు గత నెలలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. మార్చి 18న అమృత్పాల్ సింగ్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి అతనిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ఆయన తన రూపాన్ని తరచూ మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆయనకు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు హోషియార్పూర్ జిల్లా, బబక్ గ్రామవాసి రాజ్దీప్ సింగ్ కాగా, మరొకరు జలంధర్ జిల్లాకు చెందిన సర్బజిత్ సింగ్ అని పోలీసులు తెలిపారు. వీరిద్దరినీ శుక్రవారం రాత్రి డ్యూటీ మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరుపరిచారు. వీరిద్దరికీ ఒక రోజు పోలీస్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది.