సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు 2023కి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇక నుంచి యు, యుఎ, ఎ లకు బదులు వేరే సర్టిఫికేట్స్ రానున్నాయని తెలుస్తోంది. అంతేకాక ఇక నుంచి ఇంటర్నెట్లో పైరేటెడ్ ఫిల్మ్ కంటెంట్ ప్రసారం కుదరదని, దీన్ని అరికట్టడానికి గట్టి నిబంధనలను కలిగి ఉంటుందని సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై విలేకరులకు వివరించిన ఠాకూర్, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘యు’, ‘ఎ’, ‘యుఎ’లకు బదులు సినిమాలను వయసు ఆధారంగా వర్గీకరించే నిబంధనలు కూడా బిల్లులో ఉన్నాయని ఆయన చెప్పారు. “యు” అనేది అందరి కోసమని, “ఎ” అనేది వయోజన ప్రేక్షకులకు పరిమితం.
ఇక “యుఎ” అనేది 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లిదండ్రుల సమక్షంలో చూడోచ్చు. ఇక ఈ కొత్త సవరణలతో.. సినిమాలకు కూడా ఓటీటీ కంటెంటె మాదిరిగా.. “యుఎ-7+”, “యుఎ-13+”, “యుఎ-16+” సర్టిఫికేట్స్ ఉంటాయట. ఈ కొత్త సవరణలతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు సినిమాలను సర్టిఫై చేసే ప్రక్రియను మరింత సులభం అవుతుందని తెలిపారు.
ఓటీటీ కంటెంట్‌తో పాటు సినిమాలకు ఒకే రకంగా సర్టిఫై చేయోచ్చని, సినిమాలను వర్గీకరించడంలో ఏకరూపతను తీసుకురావడానికి కూడా సవరణలు ఉపయోగపడుతాయని వివరించారు. సినీ పరిశ్రమల అంచనాలకు తగ్గట్టుగానే ఈ బిల్లు ఉంటుందని, ఎలాంటి వివాదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేలా ఈ బిల్లు ఉంటుందని తెలిపారు.
పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, వయస్సు ఆధారిత సినిమా వర్గీకరణ వంటి విషయాలపై సవరణ చేయాలంటూ వచ్చిన డిమాండ్స్‌కు అనుగుణంగా ఈ బిల్లు తయారు చేయబడ్డదని చెప్పారు.