గత ఏడాది జరిగిన మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బిజెపి అభ్యర్థిని ఓడించడం కోసం కాంగ్రెస్ కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణ తెలంగాణాలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఆరోపణలపై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలని ఈటలకు సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి సవాల్ ను కొట్టిపారేసిన ఈటల తన ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానని, తాను వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదని తెలిపారు. అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం తనకు లేదని ఈటల స్పష్టంచేశారు. తాను దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని పాటించట్లేదని చెప్పారు.
తాను వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై సరైన సమయంలో జవాబిస్తానని ఈటల వెల్లడించారు. ధర్మం కోసం, ప్రజల కోసమే ఆ విధంగా మాట్లాడానని అంటూ తానెప్పుడూ ఎదుటి వారిని కించపరిచే వ్యక్తిని కాదని తెలిపారు.
అంతకు ముందు ఈటల ఆరోపణలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తానంటూ శుక్రవారం ప్రకటించారు. అన్నట్లుగానే శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఓ దశలో ఎమోషనల్ అయ్యారు.
“రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు..ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను పోరాటం చేస్తా..అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా…మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే… నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు.
భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేశానని తెలిపారు రేవంత్ రెడ్డి. తాను హిందువునని, అమ్మవారి నమ్ముతానని అన్న ఆయన అందుకే ఈటల చేసిన ఆరోపణలను నిరూపించుకోవడానికి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చానని చెప్పారు. తాను కేసీఆర్, టీఆర్ఎస్ నేతల దగ్గర ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.
“నన్ను అమ్ముడుపోయారని అంటావా? కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు. ఇది చిల్లర రాజకీయం కాదు… పోరాటం. నా నిజాయితీని శంఖిస్తే మంచిది కాదు. రేవంత్ రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు. నేను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతా..నా జీవితంలో అన్నీ ఉన్నాయి” అంటూ ఆవేశంతో ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్వం ధారపోసినా తనను కొనలేరని అంటూ బిడ్డ పెళ్లికి ఖైదీలా వచ్చిపోతే తన ఆవేదన తెలిసేదని చెప్పారు. రేవంత్‌రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదంటూ కేసీఆర్‌ను గద్దెదించడమే తన ఏకైక లక్ష్యం అని స్పష్టం చేశారు. చివరి రక్తపు బోట్టు వరకు, ఒంట్లో భయం లేకుండా కేసీఆర్ తో పోరాడుతా అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
