అమరావతి భూ కుంభకోణం, భారీ ప్రాజెక్టుల్లో అవినీతిపై దర్యాప్తు కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సూచించింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన పనులపై ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వేసిన సిట్ వేయడంపై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది.
అలాగే హైకోర్టు తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసమేనా? అని ప్రశ్నించింది. హైకోర్టు ముందుగా ఈ విషయంలో జోక్యం చేసుకుందని, అందుకే మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చుతున్నామని వెల్లడించింది.
వివరాలలోకి వెళితే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం గతేడాది సిట్ ఏర్పాటు చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.
అయితే దీనిపై తెలుగుదేశం నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సిట్ విచారణపై స్టే ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా, దురుద్దేశం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గత ప్రభుత్వ దనిర్ణయాలపై సమీక్ష జరపొద్దని అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా అని ప్రశ్నించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం కరెక్టు కాదని చెప్పింది సుప్రీంకోర్టు.
