దక్షిణాది ప్రముఖ నటుడు, దర్శకుడు మనోబాల ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 69 సంవత్సరాల మనోబాల గత రెండు వారాలుగా కాలేయ సంబంధిత సమస్యల కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. జనవరిలో యాంజియో చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ వార్త తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆయన తెలుగులో చివరగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు. శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ లో విడుదలైన డాన్ చిత్రంలో స్కూల్ టీచర్ గా అందరినీ నవ్వించారు. మనోబాలకు భార్య ఉష మహదేవన్, కుమారుడు హరీశ్ ఉన్నారు.
సినిమాల్లో తనదైన ముద్ర వేశారు మనోబాల. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. వేస్ట్ పేపర్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడిపిస్తున్నారు. తమిళ చిత్రసీమలో కొన్ని ముఖ్యమైన చిత్రాలను కూడా నిర్మించారు. తమిళంలో 700కు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్‌లో నటించారు.
ఎక్కువగా హాస్య పాత్రలు చేస్తూ కనిపించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన తమిళ సినిమాలో చాలా వరకు తెలుగులో డబ్ అయ్యాయి. శివ పుత్రుడు, చంద్రముఖి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన తెలుసు.
పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. మహానటి, దేవదాసు, రాజ్ దూత్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించారు. 1970లో సినీ పరిశ్రమలో మనోబాల అడుగుపెట్టారు. 1979లో భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. 1982లో అగయ గంగయ్ అనే సినిమాతో దర్శకుడిగా మారారు.
ఆ తర్వాత 20కి పైగా చిత్రాలను దర్శకుడిగా తెరకెక్కించారు. మూడు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. దిగ్గజ నటులు సినిమాల్లో హాస్యనటుడిగా చేశారు. అంతేకాదు.. పలు సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చివరగా ‘కొండ్రాల్ పావమ్, గోస్టీ’ సినిమాల్లో నటించారు మనోబాల.